తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంట సమయానికి క్యూ లైన్లలో నిలబడిన ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసిన వెంటనే, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు చురుగ్గా చేపట్టారు.
ఈ తొలి విడతలో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, వాటిలో 396 సర్పంచ్ స్థానాలు మరియు 9,633 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు, వీటిలో మొత్తం 12,960 మంది అభ్యర్థులు పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత కోసం 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు.
విజేతలుగా నిలిచిన సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలను ఈ రాత్రికి ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ విజేతలను ప్రకటించిన అనంతరం, ఉప సర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణ కోసం 93,905 మంది సిబ్బందిని, అలాగే రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొన్నారు.









