నేటి ప్రపంచ మానవాళిని పలు సవాళ్లు, అసమానతలు, అన్యాయాలు మరియు అపరిమిత అవినీతి సమస్యలు సతమతం చేస్తున్నాయి. ప్రపంచ యువత కలలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ, అవినీతి (Corruption) మరియు లంచగొండితనం వంటి చెదలు వారి ఎదుగుదలను, ఉద్యోగ ఉపాధి/విద్యా అవకాశాలను, వైద్య ఆరోగ్య సంరక్షణను అడ్డుకుంటున్నాయి. దీనికి తోడుగా అవినీతి విస్తరించి పర్యావరణ విధ్వంసం, ప్రతికూల వాతావరణ మార్పులకు కూడా కారణమవుతోంది.
ప్రపంచంలోని దాదాపు 2 బిలియన్ల యువత అవినీతికి వ్యతిరేకంగా బలీయ శక్తిగా ఎదిగి, నైతికతకు పట్టం కట్టి, అక్రమాల కట్టడికి నడుం బిగిస్తేనే ఉజ్వల భవిత దర్శనమిస్తుందని వార్తా కథనం స్పష్టం చేస్తోంది. యువశక్తి మాత్రమే ఆధునిక పౌర సమాజంలో వేళ్లూనుకుపోయిన అవినీతి చెదలను, లంచాల పీడలను పైకి లాగడానికి చొరవ చూపాలని కోరుతోంది. యువత నైతిక ప్రవర్తన, పారదర్శకత, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ అవినీతి నిర్మూలనకు పూనుకోవాలని పిలుపునిచ్చింది.
ఈ పోరాట ఆగ్నిని రగల్చడానికి, ఐరాస నేతృత్వంలో ప్రతి ఏటా డిసెంబర్ 09 రోజున అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినం (International Anti-Corruption Day) పాటించడం జరుగుతుంది. ఈ ఏడాది (2025) ఇతివృత్తంగా “అవినీతి నిర్మూలనతో మానవ గౌరవానికి ప్రోత్సాహం” అనే అంశాన్ని తీసుకున్నారు. ఈ వేదికగా, నీతి నిజాయితీలకు ప్రాధాన్యం ఇవ్వడం, అక్రమార్కుల భరతం పట్టడం, అవినీతి నిరోధక శాఖ ద్వారా లంచావతారులను పట్టించడం వంటి కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు.









