రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత భారత్‌కు రానున్న నేపథ్యంలో, ఆయన వ్యక్తిగత మరియు కుటుంబ వివరాల గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున అన్వేషణ ప్రారంభించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో ల్యాండ్ కానున్న పుతిన్, భారత్-రష్యా వార్షిక సదస్సులో ప్రధాని మోదీతో కలిసి పాల్గొననున్నారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అయితే, పుతిన్ తన వ్యక్తిగత మరియు కుటుంబ వివరాలను చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంచడం తెలిసిందే.
పుతిన్ తన మాజీ భార్య ల్యుడ్మిలా అలెక్సాండ్రోవ్నా ష్క్రీబ్నేవాను 1983లో వివాహం చేసుకున్నారు, కానీ వ్యక్తిగత కారణాల వల్ల 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు: మరియా పుతినా (40) మరియు కటెరినా తిఖోనోవా (39). కటెరినా రష్యన్ శాస్త్రవేత్త, గతంలో అక్రోబేటిక్ డ్యాన్సర్‌గా కూడా ఉన్నారు. పుతిన్ కుమార్తెలిద్దరూ ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడగలరు. మరియాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, 2017లో తాను తాతనయ్యానని పుతిన్ బహిరంగంగా ప్రకటించారు.
ఇటీవల ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ కుటుంబ సభ్యుల్లో కొందరు బహిరంగంగా కనిపించారు. ఆయన బంధువైన అన్నాత్సివిలేవా 2023లో ‘డిఫెండర్స్ ఆఫ్ ది ఫాదర్‌ల్యాండ్ ఫౌండేషన్’కు అధిపతిగా నియమించబడి, 2024లో డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్‌గా కూడా నియమించబడ్డారు. కాగా, పుతిన్‌కు ముగ్గురు అక్రమ సంతానం కూడా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని వార్తా కథనం పేర్కొంది.









