ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ (Anthony Albanese) తన ప్రేయసి జోడీ హేడెన్‌ను వివాహం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా చరిత్రలో అధికారంలో ఉండగా వివాహం చేసుకున్న మొట్టమొదటి ప్రధానిగా ఆయన రికార్డులకెక్కారు. 62 ఏళ్ల అల్బనీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో పనిచేస్తున్న జోడీ హేడెన్‌తో ఒక్కటయ్యారు.
కాన్‌బెర్రాలోని ప్రధాని అధికారిక నివాసం ‘ది లాడ్జ్’ గార్డెన్‌లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. పెళ్లి తర్వాత, అల్బనీస్ సోషల్ మీడియాలో ‘మ్యారీడ్’ అనే ఒకే ఒక్క పదంతో, వధువు చేతిని పట్టుకుని ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేశారు. తమ భవిష్యత్ జీవితాన్ని కలిసి పంచుకోవాలన్న ప్రేమను, నిబద్ధతను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ జంట ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వివాహ వేడుకలో అల్బనీస్ పెంపుడు కుక్క ‘టోటో’ రింగ్ బేరర్‌గా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2024 వాలెంటైన్స్ డే రోజున అల్బనీస్ ఆమెకు ప్రపోజ్ చేశారు. విడాకులు తీసుకున్న అల్బనీస్, హేడెన్‌ల పరిచయం ఐదేళ్ల క్రితం మెల్‌బోర్న్‌లో జరిగిన ఒక బిజినెస్ డిన్నర్‌లో జరిగింది. ఈ నూతన దంపతులు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే హనీమూన్‌కు వెళ్లనున్నారు.









