పిల్లల మానసిక ఆరోగ్యం, ప్రవర్తన మరియు చదువుపై సోషల్ మీడియా దుష్ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని, మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు వాడకుండా చేసేందుకు వచ్చే ఏడాది నుంచే బ్యాన్ విధించేందుకు మలేషియా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆన్‌లైన్ వయస్సు పరిమితులను ఇతర దేశాలు ఎలా అమలు చేస్తున్నాయో అధ్యయనం చేస్తున్నామని మలేషియా కమ్యూనికేషన్ మంత్రి ఫహ్మి ఫజిల్ తెలిపారు. దేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ను నియంత్రించేందుకు కూడా మలేషియా సోషల్ మీడియాపై పర్యవేక్షణను పెంచుతోంది.
పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నివారించాలని మలేషియాలో 72 శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు సెప్టెంబరులో ఐప్సాస్ మలేషియా ఎడ్యుకేషన్ మానిటర్-2025 సర్వేలో వెల్లడైంది. స్క్రీన్ టైమ్ అధికంగా ఉండటం వల్ల కంటి సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి, శారీరక చురుకుదనం తగ్గడం వంటి దుష్ప్రభావాలు పిల్లలపై పడుతున్న నేపథ్యంలో, ప్రపంచంలోని పలు దేశాలు ఇలాంటి నియంత్రణ చర్యలను తీసుకుంటున్నాయి.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇప్పటికే సోషల్ మీడియా వాడుకపై వయస్సు పరిమితులను విధించాయి లేదా విధించడానికి సిద్ధమవుతున్నాయి. ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి 16 ఏళ్ల లోపు యూజర్ల ఖాతాలను తొలగించాలని, లేదంటే భారీ జరిమానాలు విధిస్తామని ఆర్డర్లు జారీ అయ్యాయి. అదేవిధంగా, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురానున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలైన డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ వంటివి ఆన్‌లైన్‌లో హానికర కంటెంట్ నుంచి పిల్లలను కాపాడేందుకు వయస్సు నిర్ధారణ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి.









