సాధారణంగా పెళ్లిళ్లు కల్యాణ మండపాల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే, కేరళ రాష్ట్రంలో ఒక జంట తమ వివాహాన్ని అత్యంత ఊహించని పరిస్థితుల్లో జరుపుకుంది. కేరళలోని అలప్పజకు చెందిన అవని మరియు తంబోలికి చెందిన వి.ఎం. షారన్‌ల పెళ్లి శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సి ఉంది. కానీ, ఉదయం పెళ్లి కూతురు అవని అలంకరణ కోసం కారులో వెళ్తుండగా, ఆ కారు ప్రమాదానికి గురై ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో వెన్నెముకకు బలమైన గాయమైన అవనిని మొదట కొట్టాయం వైద్యకళాశాలకు, ఆ తర్వాత ప్రత్యేక చికిత్స కోసం ఎర్నాకుళంలోని వీపీఎస్ లేక్‌షోర్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.15 నుంచి 12.30 గంటల మధ్య పెళ్లికి శుభముహూర్తం ఉండటంతో, ఇరు కుటుంబాల సభ్యులు చర్చించుకుని అదే సమయంలో వివాహం జరిపించాలని నిర్ణయించారు. తొలుత వైద్యులు అభ్యంతరం చెప్పినా, వధువుకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి ఏర్పాట్లు చేశారు.
దీంతో, ఎమర్జెన్సీ వార్డులోని బెడ్‌పై పడుకొని ఉన్న వధువు అవని నుదుటిపై వరుడు వి.ఎం. షారన్ బొట్టుపెట్టి, మెడలో మూడుముళ్లు వేసి వివాహాన్ని పూర్తి చేసుకున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మరియు అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ అసాధారణ పెళ్లి జరిగింది. వధువు అవనికి త్వరలోనే వెన్నెముకకు శస్త్రచికిత్స నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ ఘటన “ఈ సీన్ ముందు సినిమా కూడా జుజుబి” అనేంతగా అందరి దృష్టిని ఆకర్షించింది.









