ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు వ్యవహారంపై కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి అరెస్టుపై ప్రజల నుంచి వస్తున్న మద్దతును ప్రస్తావిస్తూ, రవికి దమ్ముంది కాబట్టే ప్రజలు మద్దతు ఇస్తున్నారు అని పేర్కొన్నారు. టికెట్ ధరలు విపరీతంగా పెంచి, సామాన్యులు సినిమాలు చూడలేని పరిస్థితి కల్పించిన సినిమా వర్గాలను ప్రశ్నిస్తూ, “వంద రూపాయల టికెట్లను వేలల్లో అమ్ముకునే సినిమావాళ్లు ఏమన్నా సంసారులా?” అని మల్లన్న ఘాటుగా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మల్లన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నిన్ను చూస్తే జాలేస్తుంది, నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు” అంటూ ఎద్దేవా చేశారు. iBOMMA రవి భార్య హింట్ ఇవ్వకపోతే పోలీసుల అల్సేషన్ కుక్కలు కూడా అతన్ని పట్టుకునేవి కావు అని హేళన చేశారు. సినిమా వాళ్లను పక్కన పెట్టుకుని సినిమా డైలాగులు కొట్టడం మానుకోవాలని మల్లన్న హితవు పలికారు. అంతేకాకుండా, సజ్జనార్‌పై పాత కేసులను ప్రస్తావిస్తూ, “నువ్వు చేసేవన్నీ ఫేక్ ఎన్‌కౌంటర్లే, వరంగల్‌లో కూడా చేసింది అదే” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తూ సినిమా టికెట్ల అధిక ధరల సమస్యను ప్రస్తావిస్తుండగా, మరికొందరు సీపీ సజ్జనార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మరియు పైరసీ నిర్వాహకుడికి బహిరంగ మద్దతు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న పిల్లల కిడ్నాప్‌లు, సైబర్ క్రైమ్ మోసాలు, ఆర్థిక నేరాలు వంటి తీవ్ర సమస్యలపై దృష్టి పెట్టి, దమ్ముంటే వాటిని ఆపి చూపించాలని సజ్జనార్‌కి సవాల్ విసిరి, మల్లన్న ఈ కేసును ప్రజా సమస్యల కోణం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు.









