కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం కావడంతో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. ఈ తీవ్ర రద్దీ కారణంగా క్యూలైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోవడంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజున, గంటల తరబడి క్యూలైన్లలో నిలుచున్న భక్తుల మధ్య తొక్కిసలాట వంటి వాతావరణం ఏర్పడింది. ఈ గందరగోళంలో కోజికోడ్ జిల్లాలోని కోయిలాండికి చెందిన 58 ఏళ్ల మహిళ కుప్పకూలిపోయి మరణించింది. భక్తులు ఆలయ సమీపంలోని నడ పందల్ వద్ద బారికేడ్లను దూకి పదునెట్టాంబడి (18 పవిత్ర బంగారు మెట్లు) వైపు దూసుకురావడంతో ఈ తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది.
భారీగా తరలివస్తున్న భక్తుల కోసం ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భక్తులకు నీరు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) అధికారులు మరియు పోలీసుల వల్ల కూడా ఒక్కసారిగా పోటెత్తుతున్న రద్దీని నియంత్రించడం కష్టమైంది. ఈ గందరగోళంలో చిన్నారులు, వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ దుర్ఘటన తర్వాత, రద్దీని నియంత్రించడానికి ఆలయ దర్శన సమయాన్ని మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు పొడిగించారు. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు 70 వేలు, స్పాట్ బుకింగ్ ద్వారా 20 వేల మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ఆ రోజున ఎక్కువ మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారని టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ తెలిపారు. ఇకపై రోజుకు గరిష్టంగా ఒక లక్ష మంది భక్తులను మాత్రమే అనుమతించాలని, వారికి కేటాయించిన సమయ స్లాట్‌లలో మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. మృతురాలి మృతదేహాన్ని టీడీబీ ఖర్చుతో అంబులెన్స్‌లో ఆమె స్వస్థలానికి తరలించనున్నట్లు బోర్డు అధ్యక్షుడు ప్రకటించారు.









