ప్రముఖ కవి, జన వాగ్గేయకారుడు అందె శ్రీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సాంస్కృతిక, మేధో ప్రపంచానికి తీరని, పూడ్చలేని లోటు అని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆయన సంతాప సందేశాన్ని విడుదల చేసింది. అందె శ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయని మోదీ కొనియాడారు, ఆయన ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారని కితాబిచ్చారు.
“అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి,” అని ప్రధాని తన ప్రకటనలో పేర్కొన్నారు. ఒక గొప్ప కవిగా, మేధావిగా ఆయన ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తిని కలిగి ఉన్నారని మోదీ కొనియాడారు. అందె శ్రీ పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉందని, అవి ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే విధంగా ఉండేవని ప్రధాని వ్యాఖ్యానించారు.
అందె శ్రీ తన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయమని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన సామాజిక అంశాలను, ప్రజల భావోద్వేగాలను తన సాహిత్యం ద్వారా బలంగా వ్యక్తం చేయగలిగారని అన్నారు. చివరగా, ప్రధాని నరేంద్ర మోదీ కీర్తిశేషులు అందె శ్రీ కుటుంబసభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ‘ఓం శాంతి’ అంటూ తన ప్రకటనను ముగించారు.









