ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ డిసెంబర్ 13 నుంచి 15 మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో, ఫ్రాంచైజీలు తాము విడుదల చేయబోయే ఆటగాళ్లపై ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పెద్ద మొత్తంలో ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్ జట్టు గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, లాకీ ఫెర్గుసన్, మార్కస్ స్టోయినిస్, కైల్ జెమిసన్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. ఫామ్ లేమి మరియు గాయాల బెడద వంటివి వీరికి ప్రధాన కారణాలు. పంజాబ్ కింగ్స్ ఎక్కువ పర్స్ వాల్యూను ఉంచుకుని, మినీ వేలంలో ప్రత్యేకంగా ఆల్‌రౌండర్లపై (ఉదాహరణకు కామెరాన్ గ్రీన్, క్లాసెన్) దృష్టి సారించే ఛాన్స్ ఉంది. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే, రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా, విజయ్ శంకర్, నాథన్ ఎల్లిస్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే, శామ్ కరణ్ను చెన్నై విడుదల చేస్తుందనే వార్తలను సీఎస్కే అంతర్గత వర్గాలు ఖండించాయి, అతడు జట్టుతోనే కొనసాగుతాడని స్పష్టం చేశాయి.
పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కోచ్ రికీ పాంటింగ్, కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ఈసారి ట్రోఫీ గెలవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ నేపథ్యంలో, ఆ జట్టు యాజమాన్యం ప్రత్యేకంగా ఆల్ రౌండర్లు, పేస్ బౌలర్లు, ఓపెనింగ్ బ్యాటర్లపై దృష్టి సారించే అవకాశం ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెన్నై జట్టు కూడా టాప్-3లో హార్డ్ హిట్టింగ్ యువ ఆటగాళ్లను ఎంచుకోవడానికి సిద్ధమవుతోంది.









