పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్‌కు ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) కమాండర్ కాజిమ్ సవాల్ విసురుతూ ఒక వీడియోను విడుదల చేయడం సంచలనం సృష్టించింది. అఫ్ఘానిస్తాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ ప్రభుత్వానికి టీటీపీ కొరకరాని కొయ్యలా మారింది. ఈ వీడియోలో కమాండర్ కాజిమ్ నేరుగా ఆర్మీ చీఫ్‌ను ఉద్దేశిస్తూ.. “మీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే, మమ్మల్ని ఎదుర్కోవడానికి యుద్ధభూమికి రావాలి” అంటూ తీవ్ర పదజాలంతో సవాల్ విసిరాడు. పాకిస్తాన్ సైన్యం ఎందుకు, సైన్యానికి బదులుగా ఉన్నతాధికారులే రావాలని ఆయన డిమాండ్ చేశాడు. ఈ వరుస వీడియోలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి.
టీటీపీ కమాండర్ కాజిమ్, ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కుర్రం జిల్లాలో అక్టోబర్ 8న జరిగిన పాక్ సైనిక శిబిరంపై దాడికి సంబంధించిన దృశ్యాలను కూడా ఈ వీడియోతో పాటు విడుదల చేశారు. ఆ దాడిలో 22 మంది పాక్ సైనికులు మృతి చెందారని టీటీపీ ప్రకటించగా, పాక్ ప్రభుత్వం మాత్రం 11 మంది మాత్రమే మరణించినట్లు తెలిపింది. ఈ దాడి దృశ్యాలను చూపిస్తూ టీటీపీ పాక్ ఆర్మీకి మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఈ దాడి తర్వాత పాక్ ప్రభుత్వం కమాండర్ కాజిమ్ తలపై 10 కోట్ల పాకిస్తానీ రూపాయల బహుమతిని ప్రకటించింది.
అఫ్గానిస్తాన్‌తో తాత్కాలిక శాంతి నెలకొన్నప్పటికీ, పాక్ సరిహద్దుల్లో టీటీపీ దాడులు నిరంతరంగా కొనసాగుతుండటం పాక్ భద్రతా బలగాలకు ఆందోళన కలిగిస్తోంది. టీటీపీ 2007లో స్థాపించబడిన మిలిటెంట్ గ్రూప్. పాకిస్తాన్‌లో షరియా చట్టాన్ని అమలు చేయించడం, అమెరికాతో కలసి పాక్ ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టడాన్ని అడ్డుకోవడం దీని ప్రధాన లక్ష్యం. పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటూ టీటీపీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పాక్ ఆరోపిస్తుండగా, అఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రస్తుతం అఫ్గాన్ సరిహద్దు నుంచి వస్తున్న ఈ హెచ్చరికలు పాక్ భద్రతా వ్యవస్థకు అతి పెద్ద సవాలుగా మారాయి.









