రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి మొదటి బ్యాచ్‌ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, “పాకిస్తాన్‌లోని ప్రతి అంగుళం ఇప్పుడు బ్రహ్మోస్ పరిధిలో ఉంది” అని అన్నారు. అంతేకాక, “ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, ఇకపై అవసరమైతే ఫుల్ సినిమా చూపిస్తాం” అంటూ రాజ్ నాథ్ సింగ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశం ఇప్పుడు ఏ రెచ్చగొట్టే చర్యకైనా కఠినంగా, తక్షణమే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
లక్నోలోని సరోజినీ నగర్‌లో నిర్మించిన అత్యాధునిక ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ (BrahMos Aerospace) ప్లాంట్ ప్రారంభోత్సవంలో రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుమారు 200 ఎకరాల్లో విస్తరించి, రూ. 380 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ప్రతి సంవత్సరం సుమారు 100 క్షిపణులను తయారు చేస్తోంది. ఈ క్షిపణులను ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం మూడింటికీ సరఫరా చేస్తారు. బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదని, అది భారతదేశ భద్రతా చర్యలకు చిహ్నం అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
బ్రహ్మోస్ క్షిపణి రెండు దశల సూపర్‌సోనిక్ క్షిపణి, దీనిలో ఆధునిక స్టెల్త్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ గైడెన్స్ సిస్టమ్ ఉన్నాయి. దీని పరిధి 290 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించడం వల్ల ఏ శత్రు దేశం కూడా దీనిని అడ్డగించలేదు. బ్రహ్మోస్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా లక్నో ఇప్పుడు రక్షణ ఉత్పత్తికి కొత్త కేంద్రంగా మారిందని, ఇది భారతదేశాన్ని రక్షణ ఎగుమతి కేంద్రంగా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని అన్నారు.









