UPDATES  

NEWS

 ప్రగతి వేగం పెంచడంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు: సీఎం చంద్రబాబు

ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ తో ఆంధ్రప్రదేశ్ కు రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్, బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచటంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఎం ప్రశంసించారు.

 

మోదీ 21వ శతాబ్దపు నేత

ప్రధాని నరేంద్ర మోదీని ’21వ శతాబ్దపు నేత’గా అభివర్ణించిన చంద్రబాబు, ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న మోదీకి అభినందనలు తెలిపారు. తాను ఎందరో ప్రధానులను చూశానని, కానీ మోదీలా విశ్రాంతి లేకుండా అంకితభావంతో పనిచేసే ప్రగతిశీల నేతను చూడలేదని అన్నారు.

 

“సరైన సమయంలో, సరైన చోట, సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారు. ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లుగా మారాయి,” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీ సంకల్పం వల్లే 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందని, ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో 2047 నాటికి దేశం సూపర్ పవర్‌గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సైనికపరంగా ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా భారత్ సత్తాను ప్రపంచానికి చాటారని గుర్తుచేశారు.

 

జీఎస్టీ 2.0తో ప్రజలకు సూపర్ సేవింగ్స్

‘ఒకే దేశం – ఒకే పన్ను – ఒకే మార్కెట్’ నినాదంతో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానంలో చేపట్టిన తాజా సంస్కరణలు చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి అన్నారు. జీఎస్టీ 2.0తో దేశంలోని 99 శాతం వస్తువులు 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని, ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఈ పన్ను తగ్గింపు వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపశమనం కలిగిందన్నారు.

 

“ఈ సంస్కరణల ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి సుమారు రూ.15 వేల వరకు ఆదా అవుతుంది. విద్యార్థులు, రైతులు, చిరు వ్యాపారులు, కార్మికులు ఇలా సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూరుతోంది,” అని చంద్రబాబు పేర్కొన్నారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ సంస్కరణలను పండుగలా నిర్వహిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 98 వేల అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ‘బచత్ ఉత్సవ్’ కాస్తా ఇప్పుడు ప్రజల ‘భరోసా ఉత్సవ్’గా మారిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

 

కేంద్రం అండతో రాష్ట్రం ప్రగతి పథంలో

డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి కలుగుతున్న ప్రయోజనాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ‘సూపర్ హిట్’ అయ్యాయని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ, పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం-2.0, పెన్షన్ల పంపిణీ వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.

 

కేంద్రం అండతోనే అమరావతిని నిలబెట్టామని, పోలవరాన్ని గాడిన పెట్టామని, విశాఖ ఉక్కును బలోపేతం చేశామని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘స్వదేశీ’ మంత్రం బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని, సెమీ కండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకు, చిప్‌ల నుంచి షిప్‌ల వరకు ఏపీలోనే తయారు చేసేలా కార్యాచరణ రూపొందించామని వివరించారు.

 

రాయలసీమకు హైకోర్టు బెంచ్.. పెట్టుబడుల వెల్లువ

రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, విశాఖలో ఆర్సెల్లార్ మిట్టల్, 15 బిలియన్ డాలర్లతో గూగుల్ ఏఐ డేటా హబ్, నెల్లూరులో బీపీసీఎల్ రిఫైనరీ వంటి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు సభాముఖంగా ప్రకటించారు.

 

రాయలసీమలో స్టీల్, స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ల తయారీ, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు సహకరించిన ప్రధాని మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్, రైల్వే, హైవే, రక్షణ రంగాలకు చెందిన రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినట్లు గుర్తుచేశారు. బీహార్‌లో జరగబోయే ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |