UPDATES  

NEWS

 జూబ్లీహిల్స్ బైపోల్.. ! ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో.. భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిట్ పోల్స్ పై జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే ఎగ్జిట్ పోల్స్‌ గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

 

పారదర్శకత కోసమే నిర్ణయం..

 

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ 6 ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తున్నట్టు ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నిర్ణయం స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి తీసుకున్నట్టు తెలిపారు.

 

సోషల్ మీడియాలో కూడా వర్తింపు..

 

ఈ నిషేధం కేవలం మీడియాకే పరిమితం కాదని.. టీవీ, రేడియో, వార్తాపత్రికలు వంటి మాధ్యమాలతో పాటు వెబ్‌సైట్‌లు, యూట్యూబ్, వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇతర డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని చెప్పారు. ఏ రూపంలోనూ ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలు లేదని పేర్కొన్నారు.

 

నిబంధనలు ఉల్లంఘిస్తే.. అంతే సంగతులు..

 

ఈసీఐ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 126A కింద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సెక్షన్ ప్రకారం.. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు తీసుకునే అత్యంత కఠినమైన చర్యలలో ఒకటని వివరించారు.

 

పోలింగ్‌కు 48 గంటల ముందు..?

 

ముఖ్యంగా గమనించదగిన మరో విషయం ఏమిటంటే.. పోలింగ్ కు ముందు 48 గంటల వ్యవధిల కఠిన నిబంధనలు అమల్లో ఉంటుంది. సెక్షన్ 126(1)(బి) ప్రకారం.. ఈ సమయంలో ఎన్నికల విషయాలను, ముఖ్యంగా ఒపీనియన్ పోల్స్ లేదా సర్వేల ఫలితాలను ప్రదర్శించడం నిషేధం. అంటే, పోలింగ్‌పై ప్రభావం చూపే ఎలాంటి ప్రచారాన్ని కూడా ఈ కీలక సమయంలో అనుమతించనట్టు చెప్పారు.

 

ఈ నిబంధనలన్నీ పౌరులు, మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను కాపాడటానికి ఈ ఆదేశాలను జారీ చేసినట్టు వివరించారు. ఎన్నికల సంఘం సూచనలను జాగ్రత్తగా పాటించడం ద్వారా, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత ఎన్నికలకు సహకరించాలని కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |