UPDATES  

NEWS

 తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు సమీక్ష..!

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా ఉన్న శ్రీశైల ఆలయ సమగ్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్షించా రు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

 

శ్రీశైల ఆలయం అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి సీఎం సూచనలు చేశారు.

 

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ అటవీ, గిరులపైనే ఉన్నాయని వారసత్వంగా వచ్చిన ఈ ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా శ్రీశైలం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా భక్తులకు విస్తృతమైన సౌకర్యాలను కల్పించాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా లేవని అన్నారు. భూమి అందుబాటులో లేకపోతే పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలను కల్పించలేమని.. ఈ నేపథ్యంలో అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి అటవీ మంత్రిత్వశాఖకు ఈ అంశాలను వివరించాలని సూచించారు.

 

పులుల సంఖ్య పెరిగేలా చర్యలు

ఆయా ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాలను కూడా రాష్ట్రప్రభుత్వం సంరక్షిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పచ్చదనం పెంపు, అటవీ ప్రాంతాల అభివృద్ధిపై ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమాన స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని దీనికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సీఎం అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

 

డిప్యూటీ సీఎం కీలక సూచనలు

శ్రీశైలం ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, అటవీశాఖకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ నెల 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

 

భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా.. ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సందర్భంగా సౌకర్యాలు విస్తరించాలని సూచించారు. శబరిమల సహా ఇతర దేవాలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ది చేద్దామన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |