సముద్రాలు, ఆహార పదార్థాలకే పరిమితం అనుకున్న ప్లాస్టిక్ కాలుష్యం ఇప్పుడు మన శరీరంలో అత్యంత కీలకమైన భాగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఏకంగా మనిషి ఎముకల్లోకి, ఎముక మజ్జలోకి కూడా మైక్రోప్లాస్టిక్స్ (సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు) ప్రవేశిస్తున్నాయని తాజా పరిశోధనలో తేలడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది.
‘ఆస్టియోపొరోసిస్ ఇంటర్నేషనల్’ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ఈ భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఇందుకోసం శాస్త్రవేత్తలు సుమారు 62 శాస్త్రీయ కథనాలను విశ్లేషించారు. రక్తం, మెదడు, మాయ, తల్లిపాలతో పాటు ఇప్పుడు ఎముక కణజాలంలోకి, ఎముక మజ్జలోకి కూడా మైక్రోప్లాస్టిక్స్ చేరగలుగుతున్నాయని ఈ సమీక్ష నిర్ధారించింది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఈ ప్లాస్టిక్ కణాలు ఎముకల ఆకృతిని దెబ్బతీయడం, వాటి పెరుగుదలను అడ్డుకోవడం, ఎముకల బలాన్ని తగ్గించడం వంటి పరిణామాలను గమనించారు.
శరీర మరమ్మతులు, పునరుత్పత్తికి కీలకమైన ఎముక మజ్జలోని మూలకణాల పనితీరును ఈ మైక్రోప్లాస్టిక్స్ దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా, ఇవి ఆస్టియోక్లాస్ట్‌ల (ఎముకలను విచ్ఛిన్నం చేసే కణాలు) చర్యలను పెంచుతున్నాయి. దీనివల్ల ఎముకలు బలహీనపడి, సులభంగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
బ్రెజిల్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ క్యాంపినాస్ పరిశోధకుడు రోడ్రిగో బ్యూనో డి ఒలివెరా మాట్లాడుతూ “ఎముకలపై మైక్రోప్లాస్టిక్స్ ప్రభావాన్ని తేలికగా తీసుకోలేం. ల్యాబ్‌లో ఎముక కణాలపై జరిపిన అధ్యయనాల్లో ఈ ప్లాస్టిక్ కణాలు కణాల మనుగడను దెబ్బతీస్తున్నాయని, కణాల వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తున్నాయని, వాపును ప్రోత్సహిస్తున్నాయని తేలింది” అని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో 2050 నాటికి బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్) సంబంధిత ఫ్రాక్చర్ల కేసులు 32 శాతం పెరుగుతాయని ఇంటర్నేషనల్ ఆస్టియోపొరోసిస్ ఫౌండేషన్ (ఐవోఎఫ్) అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎముకల వ్యాధుల పెరుగుదలకు ప్లాస్టిక్ కాలుష్యం ఒక నియంత్రించదగిన పర్యావరణ కారణంగా భావించవచ్చా అనే కోణంలో శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.









