UPDATES  

NEWS

 ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపిన సీఐ..! ఎందుకంటే..,?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె. శంకరయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరువునష్టం దావా నోటీసు పంపడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ఆరోపణలు చేశారని శంకరయ్య ఆరోపించారు. ఈ నెల 18న న్యాయవాది జి. ధరణేశ్వరరెడ్డి ద్వారా చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపగా, అవి నిన్న వెలుగులోకి వచ్చాయి. శాసనసభ వేదికగా తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు రూ. 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో శంకరయ్య పేర్కొన్నారు.

 

శంకరయ్యపై గతంలో ఆరోపణలు:

 

2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు సీఐగా ఉన్న జె. శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

 

సీబీఐ విచారణలో శంకరయ్య పాత్ర:

 

మొదట సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తమపై ఒత్తిడి తెచ్చారని, కేసు నమోదు చేయొద్దని బెదిరించారని శంకరయ్య తెలిపారు. అయితే, మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయాల్సిన సమయంలో ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు.

 

ఆ తరువాత వారం రోజుల్లోనే, 2021 అక్టోబర్ 6న వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. నిందితుల ప్రభావంతోనే సీఐ శంకరయ్య మాట మార్చారని సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం కర్నూలు రేంజ్ వీఆర్‌లో ఉన్న శంకరయ్య నేరుగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |