UPDATES  

NEWS

 సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు..?

తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందా? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెయ్యబోతోంది? ఈ కేసును సీబీఐకి ఇవ్వనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు బదిలీ కానుందా? ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై ఇప్పటికే విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించింది సిట్. సీబీఐ రంగంలోకి దిగితే వేగంగా దర్యాప్తు జరగడం ఖాయమని అధికారులు అంటున్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ చేయడంతో అధికారులు సహకరించలేదని, అదే సీబీఐ అయితే కచ్చితంగా ఈ కేసు కొలిక్కి వస్తుందని అంటున్నారు. దీనిపై ఈ వారం లేకుంటే వచ్చేవారంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అప్పటి ప్రభుత్వ పెద్దలకు కష్టాలు తప్పవని అంటున్నారు.

 

ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ వ్యవహారంలో జడ్జిలు, రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. చాలామంది సిట్ ముందుకు వచ్చి చెప్పాల్సినవన్నీ చెప్పారు. ఇప్పుడు ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఓపెన్ గా చెబుతున్నారు. అదే సీబీఐకి అప్పగిస్తే ఏ సమస్యా ఉందని కొందరు అధికారుల మాట.

 

కాళేశ్వరం కమిషన్ విషయంలో బీఆర్ఎస్ పెద్దలు అదే చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి అప్పగించవచ్చని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటు చేసుకోవడం ఖాయం.

 

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇస్తారనే విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. దీనిపై నేతలు అంతర్గతంగా చర్చించుకోవడం మొదలైంది. ఈ కేసులో సీబీఐ దిగితే పార్టీ పనైపోయినట్టేనని అంటున్నారు. రానున్నరోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |