UPDATES  

NEWS

 కూటమి 15 ఏళ్లు కొనసాగాలి… జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన పవన్..!

ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక విజయం తర్వాత జనసేన పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దకాలానికి యువ నాయకత్వాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా కీలక కార్యాచరణను ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి సుస్థిర పాలన అందించేందుకు ప్రస్తుత ఎన్డీయే కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

సామాన్యుడి కోపం నుంచే జనసేన పుట్టింది

 

జనసేన పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న స్ఫూర్తిని పవన్ కల్యాణ్ కార్యకర్తలతో పంచుకున్నారు. “ఇది ఏదో కులం, కుటుంబం, ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. ఒక సగటు మనిషి గుండెల్లో రగిలే కోపం నుంచి, ఆవేదన నుంచి పుట్టిన పార్టీ జనసేన” అని ఆయన అన్నారు. గడిచిన 11 ఏళ్లలో తన వ్యక్తిగత జీవితాన్ని, సినిమాలను పక్కనపెట్టి కేవలం పార్టీ కోసమే జీవించానని గుర్తుచేసుకున్నారు. సినీ నటుల లోపల కూడా రగిలే అగ్నిగుండాలు ఉంటాయని అన్నారు. ఎన్నో అవమానాలు, కష్టనష్టాలు ఎదురైనా సిద్ధాంతాలకు కట్టుబడి నిలబడటం వల్లే చారిత్రక విజయం సాధ్యమైందని, పోటీ చేసిన ప్రతీచోటా గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని తెలిపారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం, ఏజెన్సీలో గిరిజనుల కష్టాలు తీర్చడం వంటివి తనకు ఆత్మసంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు. కేవలం సిద్ధాంతాలపై నమ్మకం ఉన్నవారే నేటికీ తనతో కలిసి నడుస్తున్నారని పవన్ స్పష్టం చేశారు.

 

దసరా తర్వాత ‘త్రిశూల్’.. నాయకత్వ వికాసమే లక్ష్యం

 

పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించారు. దసరా పండుగ తర్వాత ‘త్రిశూల్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీలోని ప్రతి క్రియాశీల సభ్యుడిని నేరుగా పార్టీ సెంట్రల్ కమిటీ నేతలతో అనుసంధానం చేస్తామని వివరించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే పదేళ్లలో యువతను బలమైన నాయకులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, 2030 నాటికి అనేకమంది శక్తివంతమైన నాయకులను రాష్ట్రానికి అందిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వీరమహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ పదవుల్లో వారికి 33 శాతం కేటాయిస్తామని ప్రకటించారు. క్రమశిక్షణ, అంకితభావం, స్థిరత్వం ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని యువతకు పిలుపునిచ్చారు.

 

కూటమి పటిష్ఠంగా ఉండాలి

 

ప్రస్తుత కూటమి ప్రభుత్వ స్థిరత్వంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మనం బలహీనపడితే రాష్ట్రంలో మళ్లీ అరాచక పాలన వస్తుంది. కాబట్టి ఈ కూటమి చాలా కాలం కొనసాగాలి. రాష్ట్రానికి వచ్చే 15 ఏళ్ల పాటు రాజకీయ స్థిరత్వం చాలా అవసరం” అని ఆయన అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య పక్షాల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తితే వాటిని సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. 2019-24 మధ్య కాలంలో తమ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్నడూ ప్రధాని లేదా హోంమంత్రి సహాయం కోరలేదని, ఆత్మగౌరవంతోనే నిలబడ్డామని గుర్తుచేశారు.

 

ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదని, తాను విప్లవ మార్గాన్ని ఎంచుకోలేదని పవన్ పేర్కొన్నారు. రాజకీయాలంటే వ్యాపారం కాదని, ప్రజాసేవ అని నమ్మి నిస్వార్థంగా పనిచేస్తున్నందునే మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సభ జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు, పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఒక స్పష్టమైన మార్గదర్శినిగా నిలిచింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |