UPDATES  

NEWS

 ఏపీ ఇంటర్‌ పరీక్షల విధానంలో భారీ మార్పులు..!

ఏటా మార్చిలో నిర్వహించే పబ్లిక్ పరీక్షలను ఈసారి నెల ముందుగానే, అంటే ఫిబ్రవరిలోనే నిర్వహించాలని ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్ణయించింది. సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ మార్పు చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల పరీక్షలు త్వరగా ముగించి, ఏప్రిల్‌లో తరగతులు నిర్వహించేందుకు వీలవుతుందని బోర్డు భావిస్తోంది. పరీక్షల నిర్వహణ విధానంలోనూ బోర్డు కీలక సంస్కరణలు చేపట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు రోజుకు ఒకే సబ్జెక్టుకు పరీక్ష పెట్టాలని నిర్ణయించారు. మొదట సైన్స్ గ్రూపు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్ పరీక్షలు పూర్తయ్యాక భాషా సబ్జెక్టులకు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు జరుగుతాయి.

 

ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా ‘ఎంబైపీసీ’ గ్రూపును ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఒకే విద్యార్థికి వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టే రోజుకు ఒకే పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారు.

 

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పలు సంస్కరణలను కూడా అమలు చేస్తున్నారు. సిలబస్‌ను పూర్తిగా ఎన్‌సీఈఆర్టీకి అనుగుణంగా మార్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు 85 మార్కులకు రాతపరీక్ష నిర్వహించి, మిగతా మార్కులను రెండో ఏడాది ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నారు. బయాలజీలో వృక్షశాస్త్రానికి 43, జంతుశాస్త్రానికి 42 మార్కులు ఉంటాయి. అన్ని పేపర్లలోనూ కొత్తగా ఒక మార్కు ప్రశ్నలను చేర్చారు. అయితే, ప్రాక్టికల్ పరీక్షలను థియరీ పరీక్షలకు ముందు జనవరి చివర్లో నిర్వహించాలా లేక థియరీ పరీక్షల తర్వాత పెట్టాలా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |