UPDATES  

NEWS

 ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఈసీపై చర్యలు.. రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు..

ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా బీహార్‌లోని గయలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆయన తీవ్రంగా విమర్శించారు.

 

ఓట్ల అవకతవకల వ్యవహారం వెలుగు చూసినప్పటికీ ఈసీ ఇంకా తనను అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కొంత సమయం ఇస్తే ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానంలో ఎన్నికల సంఘం లోపాలను ప్రజల ముందు ఉంచుతామని, దాంతో వారే ఈసీని అఫిడవిట్ ఇవ్వాలని అడుగుతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

 

ప్రధాని మోదీ స్పెషల్ ప్యాకేజీ గురించి మాట్లాడినట్లే, ఈసీ కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట బీహార్ కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చిందని, ఇది ఓట్ల చోరీకి కొత్త రూపమని విమర్శించారు. బీహార్ ప్రజలు ఇది జరగనివ్వరని అన్నారు. బీహార్‌లో, కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడే రోజు వస్తుందని, అప్పుడు ఓట్ల చోరీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లపైనా చర్యలు తీసుకుంటామని రాహుల్ హెచ్చరించారు.

 

అంతకు ముందు ఔరంగాబాద్ జిల్లాలో ఓట్లు కోల్పోయిన పౌరులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. గత నాలుగైదు ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి ఓట్లను కూడా చోరీ చేశారన్నారు. తాము పేదల హక్కుల కోసం పోరాడుతున్నామని, ఓట్ల చోరీకి అడ్డుకట్ట వేస్తామని రాహుల్ పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |