UPDATES  

NEWS

 అలాంటి బెదిరింపులకు మేం లొంగిపోం… రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ’ ఆరోపణలపై సీఈసీ స్పందన..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ’ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తాము రాజీపడబోమని, ఓటర్లకు ఎల్లప్పుడూ బలమైన అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ మాట్లాడారు.

 

“ఎన్నికల సంఘం భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తే, మేము అలాంటి బెదిరింపులకు లొంగిపోమని స్పష్టం చేస్తున్నాం. పేద, ధనిక, వృద్ధులు, మహిళలు, యువత అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఈసీ నిర్భయంగా అండగా నిలుస్తుంది” అని ఆయన ఉద్ఘాటించారు.

 

బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రాజకీయ పార్టీల మధ్య తాము ఎలాంటి వివక్ష చూపబోమని, ఏ పార్టీకి చెందిన వారైనా సరే తమ రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తించడంలో వెనకడుగు వేయబోమని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పారదర్శకంగా పనిచేస్తున్నారని, వారు ధృవీకరించిన పత్రాలు, వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.

 

“క్షేత్రస్థాయిలో పార్టీలు నియమించిన ప్రతినిధులు ధృవీకరించిన విషయాలు రాష్ట్రస్థాయి లేదా జాతీయస్థాయి నేతలకు చేరడం లేదో, లేక వాస్తవాలను పక్కనపెట్టి వారిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం” అని జ్ఞానేశ్ కుమార్ అన్నారు.

 

కొందరు నేతలు ఓటర్ల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శించడంపై సీఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని హెచ్చరించారు. ఎన్నికల సంఘంపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |