UPDATES  

NEWS

 చర్చకు సిద్ధమా..? జగన్ కు నాదెండ్ల మనోహర్ సవాల్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానూరు సివిల్ సప్లై భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతూ అబద్ధాల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. “రైతుల కోసం మీరు ఏం చేశారో చర్చకు సిద్ధమా?” అని ఆయన జగన్‌కు సవాల్ విసిరారు.

మంత్రి మనోహర్ మాట్లాడుతూ, జగన్ ప్రజల తీర్పును అర్థం చేసుకోవాలని, ప్రజలు ఐదేళ్లకు ఒకసారి అధికారం ఇస్తారని జగన్ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో గుంతలు కూడా పూడ్చలేకపోయిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యపాన నిషేధం, అమ్మ ఒడి వంటి హామీలను జగన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.

రైతులకు మద్దతు

జగన్ పాలనలో రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టారని, గోదావరి జిల్లాలో క్రాఫ్ హాలిడే ప్రకటించి రైతులకు నరకం చూపించారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.12,857 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసిందని, ఇందులో రూ.12,000 కోట్లు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. కొంత ఆలస్యంతో రూ.1,000 కోట్లు 40 రోజుల్లో జమ చేశామన్నారు. జగన్ ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలని, గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

జగన్ పర్యటనలపై విమర్శలు

జగన్ బెంగళూరు నుంచి పనిచేస్తూ, నెలకు ఒకసారి రాష్ట్రానికి వచ్చి పర్యటనల పేరుతో అలజడి సృష్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో రాజకీయ లబ్ధి కోసం సమాజంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలన ప్రజలకు నచ్చకే 11 సీట్లకు పరిమితమయ్యారని, ప్రజలు కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వ విధానం

పవిత్రమైన పంటను రోడ్డుపై వేసి ట్రాక్టర్లతో తొక్కించడం దారుణమని, అమరావతి, పోలవరం వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం ఎంత చేస్తుందో ప్రజలు చూస్తారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటం, మంచి పాలన, సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. “అద్భుతమైన పాలనను కూటమి ప్రభుత్వం అందిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |