UPDATES  

NEWS

 వక్ఫ్ బిల్లు ఆమోదంపై ముస్లింలు సీరియస్.. దేశవ్యాప్తంగా భారీ నిరసనలు..

పార్లమెంట్ లోని ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర పడిన కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున ముస్లిం సామాజిక వర్గం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నిరసన గళం వినిపిస్తూ ముస్లిం సంఘాలు నిరసనకు దిగాయి. “వక్ఫ్ సవరణ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం” అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా, తమినాడులోని చెన్నై, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. జాయింట్ ఫారమ్ ఆఫ్ వక్ఫ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగినట్లు జాతీయ మీడియా తెలిపింది.

 

ముఖ్యంగా వక్ఫ్ బిల్లుపై నిరసన కార్యక్రమం అహ్మదాబాద్ లో తీవ్రరూపం దాల్చింది. రోడ్లపై కూర్చొని పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారిని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.

 

తమిళనాడులో విజయ్ పార్టీ నేతృత్వంలో నిరసన

 

తమిళ రాజధాని నగరం చెన్నైలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ ఇటీవలే పార్టీ స్థాపించిన నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ రాష్ట్రవ్యాప్త నిరసనను ప్రకటించింది. చెన్నై, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లో ముస్లింలకు మద్దతుగా టీవీకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారు. చేతిలో ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. “ముస్లింల హక్కులను హరించవద్దు” అంటూ నిరసన చేశారు.

 

కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు – 2025పై పార్లమెంటులో ఆమోద ముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యలో లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. గురువారం రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.

 

దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. అయినా చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. కేంద్రంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జెడియు పార్టీల ఎంపీలు కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం జరిగింది.

 

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్లు

 

పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఆమోదం పొందడంతో.. బిల్లుకు వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వక్ఫ్ సవరణ బిల్లు 2025పై కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద, ఎంఐఎం అధినేత ఒవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

 

ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సుప్రీంకోర్టులో అసదుద్దీన్ ఒవైసీ సవాల్ చేశారు. ఈ బిల్లులో నిబంధనలు.. ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని, ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని కాంగ్రెస్ ఎంపీ జావేద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |