UPDATES  

NEWS

 విద్యావ్యవస్థపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌కు స‌మ‌గ్ర విధాన ప‌త్రం రూపొందించాల‌ని సీఎం రేవంత్ విద్యా క‌మిష‌న్‌ను ఆదేశించారు. ఉత్త‌మ విద్యా వ్య‌వ‌స్థ ఏర్పాటుకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడ‌మ‌ని అన్నారు. ప్ర‌స్తుత విద్యా వ్య‌వ‌స్థ‌లో లోపాలతో పాటు తీసుకురావ‌ల్సిన సంస్క‌ర‌ణ‌ల‌పై సీఎం రేవంత్ స‌మీక్ష నిర్వ‌హించారు.

 

సమీక్షలో భాగంగా విద్యా రంగానికి త‌మ ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రాధాన్య‌త‌, ఉపాధ్యాయుల నియామ‌కం, అమ్మ ఆద‌ర్శ క‌మిటీలు, పుస్త‌కాలు, యూనిఫాంల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీల నిర్మాణాన్ని సీఎం రేవంత్ వివ‌రించారు. ప్రాథ‌మిక ద‌శలో అందే విద్య‌తోనే పునాది బ‌ల‌ప‌డుతుంద‌ని అభిప్రాయపడ్డారు. ప్రాథ‌మిక విద్య‌ను బ‌లోపేతం చేస్తే ఉన్న‌త చ‌దువుల్లో విద్యార్థులు మ‌రింత మెరుగ్గా రాణించ‌గ‌ల‌ర‌ని తెలిపారు.

 

“అంగ‌న్‌వాడీలు, ప్రాథ‌మిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పుల‌పై స‌మాజంలోని వివిధ సంఘాలు, ప్ర‌ముఖుల‌తో చ‌ర్చించి మెరుగైన విధాన ప‌త్రం రూపొందించాలి. మ‌న‌కు ఉన్న వ‌న‌రులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, విద్యా వ్య‌వ‌స్థ‌లో తెలంగాణ అగ్ర‌గామిగా ఉండేందుకు దోహ‌ద‌ప‌డేలా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఉండాలి” అని సీఎం రేవంత్ సమీక్షలో వివరించారు.

 

ఈ సమీక్షలో వివిధ రాష్ట్రాల్లోని ప‌ర్య‌ట‌న‌లు, ఆయా రాష్ట్రాలు, ఇత‌ర దేశాల్లో ప్రాథ‌మిక విద్య‌లో అనుస‌రిస్తున్న విధానాల‌ను విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఆకునూరి ముర‌ళీ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. 1960 ద‌శ‌కం నుంచి ప్ర‌స్తుతం వ‌ర‌కు విద్యా వ్య‌వ‌స్థ‌లోని తీసుకువ‌చ్చిన ప‌లు సంస్క‌ర‌ణ‌లు క్ర‌మేణా విద్యార్థుల సృజ‌నాత్మ‌క శ‌క్తి, ఆలోచ‌నాధోర‌ణిని ఎలా హ‌రించి వేశాయో ఫౌండేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ తెలిపారు.

 

ఈ సమావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కేశ‌వ‌రావు, శ్రీ‌నివాస‌రాజు, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, ప్రాథ‌మిక విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌ర‌సింహారెడ్డి, విద్యా క‌మిష‌న్ స‌భ్యులు ప్రొఫెస‌ర్ పి.ఎల్‌.విశ్వేశ్వ‌ర్‌రావు, చార‌కొండ వెంక‌టేష్‌, కె.జ్యోత్స్న శివారెడ్డి, ప‌లు ఎన్జీవోల ప్ర‌తినిధులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |