ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత రాజ్యసభ.. శాసన మండలిలో ఆ పార్టీ సభ్యులు కూటమి వైపు వెళ్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరగా..సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక, తాజాగా వక్ఫ్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం వేళ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ నిర్ణయించింది. లోక్ సభలో వ్యతిరేకంగా ఓటింగ్ చేసారు. రాజ్యసభ లో మాత్రం వైసీపీ ఎంపీ ఒకరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతోంది..
రాజ్యసభలో ఏం జరిగింది
వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించాలని నిర్ణయించింది. లోక్ సభలో వైసీపీకి చెందిన నలుగురు సభ్యులు వ్యతిరేకంగా ఓటింగ్ చేసారు. ఈ బిల్లుకు ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు గా ఉన్న టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చారు. కొన్ని సవరణలు ప్రతిపాదించిన టీడీపీ బిల్లుకు మద్దతు ఇచ్చింది. జనసేన అధికారికంగా తాము బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ నిర్ణయం తో ఏపీలోని ముస్లిం వర్గాలు నిరసనలు నిర్వహించాయి. ఇదే సమయంలో వైసీపీ పైన టీడీపీ గురి పెట్టింది. వైసీపీ రాజ్యసభలో అనుకూలంగా ఓటింగ్ చేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. దీని పైన వైసీపీ స్పందించింది.
ఎంపీ క్రాస్ ఓటింగ్..?
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు సభ్యులు ఉన్నారు. కాగా, ఒక వైసీపీ సభ్యుడు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు ప్రచారం సాగుతోంది. వ్యక్తిగతంగా ఎవరు క్రాస్ ఓటింగ్ చేసారనే అంశం పైన ఓపెన్ గా చెప్పే అవకాశం ఉండదనే చర్చ ఉంది. ఇదే సమయంలో పెద్దల సభలో వ్యతిరేక ఓట్లు లెక్క కంటే ఒకటి ఎక్కువగా వచ్చిందని.. వైసీపీకి చెందిన ఒక సభ్యుడు క్రాస్ ఓటింగ్ చేసారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో భాగంగా వైసీపీకి చెందిన ఒక సబ్యుడి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ సభ్యుడి తో నేరుగా బీజేపీ నేతల సంప్రదింపులతో ఆయన బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ చేసారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.