UPDATES  

NEWS

 అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి కేటాయించిన స్థలంలోనే క్రికెట్ స్టేడియం కూడా ఉండాలన్న సీఎం చంద్రబాబు సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో స్టేడియం నిర్మించనున్నట్టు వివరించారు. భారీ స్టేడియం నిర్మిస్తుండటంతో దాని పక్కన ప్రజా రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉండాలన్న ఏసీఏ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఐసీసీ చైర్మన్ జైషా కూడా అనుమతినిచ్చినట్టు పేర్కొన్నారు.

 

విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఏసీఏ తరపున ఢిల్లీ కేపిటల్స్‌ను అడిగితే విశాఖలో స్టేడియం బాగాలేదని తిరస్కరించారని, దీంతో మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుని స్టేడియాన్ని బాగు చేస్తే రెండు మ్యాచ్‌లు ఇస్తామని చెప్పారని శివనాథ్ గుర్తు చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు.

 

నిజానికి మంగళగిరి స్టేడియాన్నే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా తీర్చిదిద్దాలని అనుకున్నామని, కానీ లోపల నిర్మాణ ప్రాంతం దెబ్బతినడంతో సాధ్యం కాలేదని చెప్పారు. కాబట్టి ఆ స్టేడియంను రంజీ మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధం చేస్తామన్నారు. ఏడాదిలో 150 రోజులపాటు ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు శివనాథ్ వివరించారు. అలాగే, విజయవాడ, కడప, విజయనగరంలలో క్రికెట్ అకాడమీలు ప్రారంభిస్తున్నామని, అరకు, కుప్పం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో స్టేడియాలు ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ క్రికెట్ గ్రౌండ్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు శివనాథ్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |