మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఢిల్లీలో వీరి భేటీ జరగగా సుమారు 40 నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బిల్‌గేట్స్‌తో సమావేశం గురించి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ మేరకు ఆ పోస్టులో.. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావొచ్చనే అంశంపై చర్చ జరిగిందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపరచడానికి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికత అవకాశాలను ప్రస్తావించినట్టు వివరించారు.
అంతే కాకుండా స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్ ను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో, ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. అలానే ఏపీ పురోగతి కోసం సమయం ఆకేటాయించినందుకు బిల్ గేట్స్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రాసుకొచ్చారు.