ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీని లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయంపై చర్చించడానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు మరియు డాక్టర్ వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, శాసన విభాగ సెక్రటరీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రతినిధులు మరియు ఈసీఐ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
అర్హులైన వారందరికీ ఓటర్ గా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం, నకిలీ ఓటర్ ఐడీలను తొలగించడం వంటి అంశాలపై చర్చించడం కోసమే ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలో, ఓటర్ ఐడీలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం జరుగుతుంది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్నికల కమిషన్ సాంకీతిక నిపుణుల బృందంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) విభాగం ఉన్నతాధికారుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం కానున్నాయి.
ఆర్టికల్ 326 ప్రకారం, భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంది. ఆధార్ కార్డు ద్వారా పౌరుని గుర్తింపును నిర్ధారించడం జరుగుతుంది. ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 23(4), 23(5), 23(6)లోని నిబంధనలకు అనుగుణంగా, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మాత్రమే జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నిర్ణయం ప్రకారం, త్వరలో యూఐడీఏఐ ఈసీఐ సాంకేతిక నిపుణుల మధ్య సాంకేతిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఆధార్, మొబైల్ నెంబర్ తో ఓటరు కార్డు లింక్ తప్పనిసరి..!
ఓటర్ జాబితాలో అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు వంటి అంశాలపై విపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంపై పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగింది. ఇటీవల, ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, ఓటర్ డేటాలోని నకిలీ ఓటర్ నంబర్ల సమస్యపై చర్చించింది. ఈ సమావేశంలో.. ఓటర్లను సక్రమంగా గుర్తించేందుకు ఓటర్ జాబితాను ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం అధికారులను ఇటీవలే ఆదేశించింది.
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికలను జాతీయ సేవగా పరిగణిస్తూ, ఈసీ తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వహించడంలో ఏ మాత్రం వెనుకాడదని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రధాన ఎన్నికల అధికారులకు (CEOలు) పంపిన నోట్‌లో, ఆధార్ నంబర్లను ఓటర్ జాబితాతో అనుసంధానించడానికి ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు.
ఇంటింటి సర్వేల సమయంలో, 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే, 2022లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో, ఓటర్ నమోదుకు ఆధార్ లింక్ తప్పనిసరి కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ తాజా ఆదేశాలు దానికి భిన్నంగా ఉన్నాయి.
ఓటర్ జాబితా ప్రక్షాళనలో పారదర్శకత పాటించాలని, డూప్లికేట్ ఓటర్ ఫోటోలు మరియు గుర్తింపు కార్డు నంబర్లను తొలగించాలని మూడు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు సమర్పించాయి. ఈ సమస్యలపై ఏప్రిల్ 30లోగా సలహాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం అన్ని పార్టీలను కోరింది.