తెలంగాణ శాసనసభ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించింది. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. గ్రూపు-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్, మాదిగలు ఉన్న గ్రూప్-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్, మాలలు ఉన్న గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోందని అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. బాబూ జగ్జీవన్ రామ్‌కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలను అప్పగించి గౌరవించిందని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా చేసిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగిందని తెలిపారు.