ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ నేరుగా కట్టించుకుంటున్న పన్నులన్నీ ఇకపై ఆన్ లైన్ ద్వారా వసూలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం స్వర్ణ పంచాయత్ పేరుతో ఓ ఆన్ లైన్ పోర్టల్ ను డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఇక పన్నులన్నీ సులువుగా ఆన్ లైన్లో ఒకే చోట చెల్లించవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం పంచాయతీల్లో వివిధ రూపాల్లో వసూలవుతున్న పన్నులు ప్రభుత్వానికి పూర్తిస్దాయిలో జమ కావట్లేదు. దీనికి స్థానికంగా ఉండే సిబ్బంది చేతివాటమే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. వీరిపై పర్యవేక్షణ ఉంచాల్సిన అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో నిధులు ఎటుపోతున్నాయో తెలియడం లేదు. దీంతో స్వర్ణ పంచాయత్ పేరుతో ఓ వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్నారు. ఇకపై ఇందులోనే అన్ని పంచాయతీ పన్నులు కట్టించబోతున్నారు.
ఇకపై పంచాయతీల్లో పన్నుల్ని సిబ్బంది డిమాండ్ క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా ప్రజల నుంచి వసూలు చేస్తారు. దీంతో వసూల్లు పక్కదారి పట్టే అవకాశాలు ఉండబోవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ప్రతీ పంచాయతీ నుంచి వసూలైన మొత్తాలతో పాటు ఖర్చుపెట్టిన లావాదేవీల్ని కూడా ఈ స్వర్ణ పంచాయత్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. దీంతో పంచాయతీల్లో పాలన పారదర్శకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమయ్యాక పన్ను వసూళ్లు ఆన్ లైన్ లో ప్రారంభిస్తారు.