ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల ఈ పర్యటన కోసం ఈ మధ్యాహ్నం 3 గంటలకు హస్తినకు చేరుకున్నారాయన. ఆ వెంటనే పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించారు.
ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కొందరు ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆయనతో సమావేశం అయ్యారు.
దాదాపుగా గంటకు పైగా అమిత్ షా- చంద్రబాబు మధ్య సమావేశం కొనసాగింది. పలు అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలు, రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు.. వంటి విషయాలపై చర్చలు సాగాయి.
ఈ భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు.. నిర్మల సీతారామన్‌ను ఆమె నివాసంలో కలుసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల విడుదల గురించి కూడా కోరారని అంటున్నారు. చంద్రబాబు ప్రతిపాదనలపై నిర్మల సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
అనంతరం చంద్రబాబు ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి రింగ్ రోడ్ ప్రాజెక్ట్ మంజూరు చేయడం, అన్ని జిల్లా కేంద్రాల నుంచి రోడ్ కనెక్టివిటీ కల్పించడం, ఫ్లైఓవర్ల మంజూరు, జాతీయ రహదారుల విస్తరణ గురించి మాట్లాడారు.
నితిన్ గడ్కరీతో భేటీ ముగిసిన తరువాత చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశం వివరాల గురించి వివరించారు. మున్ముందు జరగబోయే ఎన్నికల సందర్భంగా పార్టీల బలోపేతం గురించి చర్చించామని, ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నామని అన్నారు. ఎన్డీఏను ఎలా మరింత బలోపేతం చేయాలో కూడా చర్చించామని చంద్రబాబు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణల నిరోధక బిల్లు గురించి తాను ప్రస్తావించానని చంద్రబాబు తెలిపారు. గత అయిదు సంవత్సరాల కాలంలో భూ సంబంధిత అనేక సమస్యలు తలెత్తాయని అన్నారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు, భూ కబ్జా వ్యవహారాలు అతిపెద్ద సమస్యగా అభివర్ణించారు చంద్రబాబు.
గతంలో ఇదే తరహా పరిస్థితులు గుజరాత్‌లో ఉత్పన్నం కాగా.. ఈ భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని చాలా బాగా అమలు చేశారని ప్రశంసించారు. ఏపీలో అలాంటి చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లోనూ దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించామని చంద్రబాబు గుర్తు చేశారు. వీలైనంత త్వరగా దీన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు