తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హావా కొనసాగింది. రాష్ట్రంలో నిర్వహించిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి (Anji Reddy) ఘన విజయం సాధించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా జరిగిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా అంజిరెడ్డి గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయం కావడంతో నరేందర్ రెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు.
మరోవైపు, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. టీచర్స్ కోటాలో మొత్తం 25,041 ఓట్లు ఉండగా.. అందులో 897 ఓట్లు చెల్లనివిగా తేలాయి. చెల్లుబాటైన 24,144 ఓట్లలో మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు దక్కాయి.
పీఆర్టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి 7182 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2621 ఓట్లతో మూడో స్థానంలో అశోక్ కుమార్ నిలిచారు. తెలంగాణలో మూడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులో సంబరాలు చేసుకుంటున్నాయి.
కాగా, తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీపై ఎంత నమ్మకం ఉందో మరోసారి ఈ ఎన్నికల్లో నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ డబ్బులతో గెలవాలని చూసినా.. ప్రజలు మాత్రం బీజేపీ అభ్యర్థులనే గెలిపించారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ మంచి విజయాలు సాధిస్తోందన్నారు.
కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీచర్స్, పట్టబద్రుల ఎమ్మెల్సీ రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించామన్నారు.