కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోపై వరంగల్ ఎయిర్‌పోర్టుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలంటూనే, నిత్యం రాకపోకలు ఉండేలా డిజైన్ రూపకల్పన చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
సీఎం రేవంత్ సమావేశం వెనుక
శనివారం సాయంత్రం మామునూరు ఎయిర్‌పోర్టుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని ఆదేశించారు. విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ, పెండింగ్ అంశాల వివరాలను అధికారులను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సాధ్యమైన తొందరగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి. డిజైనింగ్ విషయంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. దీని నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలన్నారు. ప్రగతి నివేదిక ప్రతి నెలా తనకు అందించాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేసి డిజైనింగ్‌కు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఇక్కడి నుంచి దక్షిణాదిలోకి కీలకమైన ప్రాంతాలకు విమానాలను నడపాలన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది.
పాత ఒప్పందం ఏంటి?
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమాశ్రయానికి 150 కిలో మీటర్ల పరిధిలో మరో విమానాశ్రయానికి అనుమతి ఇవ్వకూడదనే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ విధంగా కేంద్ర విమానయాన-జీఎంఆర్‌తో ఆ విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా మామునూరు విమానాశ్రయం ఏర్పాటు విషయం పెండింగ్‌లో పడిపోయింది.
ఇదే విషయంపై జీఎంఆర్ సంస్థతో సంప్రదింపులు జరిపింది విమానయాన శాఖ. చివరకు మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ ఎన్ఓసీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కీలకమైన అడ్డంకులు తొలగిపోయాయి.
విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి 943.14 ఎకరాల భూమి అవసరం కావాల్సివుంది. ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. అదనంగా మరో 253 ఎకరాల భూమిని కావాలని అధికారులు గతంలో గుర్తించారు. అయితే భూసేకరణ అంశం కొన్నాళ్లుగా రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టుకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రూ.205 కోట్లు విడుదల చేసింది. దీంతో భూసేకరణకు లైన్ క్లియర్ అయ్యింది. త్వరలో ఎయిర్‌పోర్టు పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. మామునూరు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ధన్యవాదాలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.