సినీ పరిశ్రమ ఇటీవల ఒక గొప్ప నటిని కోల్పోయింది. అలనాటి నటి, నిర్మాత, గాయని అయిన కృష్ణవేణి.. తన 101వ ఏట కన్నుమూశారు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం సంతాపం తెలియజేసింది. అంతే కాకుండా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని కల్చరల్ సెంటర్‌లో కృష్ణవేణి సంస్మరణ సభ జరిగింది. దీనికి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులు కూడా వచ్చారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యి సినీ పరిశ్రమపై సీరియస్ అయ్యారు. దాని వెనుక ఒక కారణం ఉంది.
ఈతరం నటీనటులు నేర్చుకోవాలి
సినీ పరిశ్రమకు కృష్ణవేణి (Krishnaveni) చేసిన సేవలను తన సంస్మరణ సభలో గుర్తుచేసుకున్నారు వెంకయ్య నాయుడు. చిన్న వయసు నుండే నాటకాల్లో పాల్గొంటూ సీనియర్ ఎన్‌టీఆర్ లాంటి హీరోను సైతం నిర్మాతగా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణికి దక్కిందని అన్నారు. అప్పట్లో కృష్ణవేణితో కలిసి పనిచేసిన ప్రతీ హీరోయిన్ కూడా ఆమె గురించి గొప్పగా చెప్తుంటారని తెలిపారు. ఆవిడ నటన, డైలాగ్ డెలివరీ అద్భుతమన్నారు. ఈరోజుల్లో కొత్తగా సినిమాల్లోకి నటీనటులుగా అడుగుపెట్టేవారంతా కృష్ణవేణి మొహంలోనే హావభావాలను ఎలా పలికించేవారని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు వెంకయ్య నాయుడు. ఇలాంటివి కొంతమంది మాత్రమే చేయగలని అప్పటి నటీనటులను గుర్తుచేసుకున్నారు.
సినిమా ఎందుకిలా తయారయ్యింది?
అప్పట్లో సినిమాలను ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించేవారని, అందులో సంస్కారవంతమైన నటన ఉండేదని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఆనాటి పాటల ద్వారా కూడా మంచి సందేశం, మనసుకు ఉల్లాసం కలిగేదని అన్నారు. ‘‘అప్పట్లో సినిమాల్లో తాకకుండానే శృంగారం పండించేవారు. ఇప్పుడు తాకినా, పీకినా, గోకినా ఆ భావన కలగడం లేదు. సినిమా ఎందుకిలా తయారయ్యింది? ఇప్పుడు సంభాషణలు వ్యంగ్యంగా డబుల్ మీనింగ్‌తో ఉంటున్నాయి. డబుల్ మీనింగ్ పదాలు వాడితేనే ప్రేక్షకులు చూస్తారని అనుకుంటున్నారు. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు. అది ప్రజలకు సందేశం’’ అని చెప్పుకొచ్చారు వెంకయ్య నాయుడు.
ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు
‘‘అప్పట్లో కూడా విలన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు విలన్స్‌నే హీరోలు చేస్తున్నారు. స్మగ్లర్లను, దేశద్రోహులను లేదా తప్పుడు విధానాలు పాటించేవాళ్లను హీరోయిజం అని చూపిస్తున్నాం. అలా చేయకూడదు. అలాంటి ఆలోచనలు పిల్లల ముందు పెట్టకూడదు. అశ్లీలమైన పదజాలాలు సినిమాల్లో ఉండకూడదు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్పడం లేదు’’ అని అన్నారు వెంకయ్య నాయుడు. దీంతో ఈతరం నటీనటులపై, సినిమాలపై వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కామెంట్స్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్‌గా చూపించడం నచ్చక ఆయన ఇలా మాట్లాడారని చాలామంది ఫీలవుతున్నారు.