ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 90 రోజులు(3 నెలల పాటు) టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో మొత్తం 1,02,832 మంది టైలరింగ్ నేర్చుకునేందుకు ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్నారని వివరించంది. దీనికోసం 255 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందికి కుట్టు మిషన్లను ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో వారి అందరికీ టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే డ్వాక్రా రుణాల పేరుతో ఆర్థిక సాయం చేస్తుంది. మహిళలకు వంట గ్యాస్ పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు సర్కార్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
తల్లికి వందనం కింద ప్రతి స్టూడెంట్ తల్లి అకౌంట్ లో రూ.15వేలు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు అసెంబ్లీలో సమావేశాల్లో మంత్రి పయ్యావుల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాన్ని కూడా కూటమి సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం చంద్రబాబు సర్కార్ మంచి స్కీంలను అమలు చేస్తుందని చెప్పుకొస్తున్నారు.