తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు.. తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు నుంచి లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 8గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. అయితే ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. తుది ఫలితాలను..ఇవాళ ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది.
గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క టేబుల్ కు ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. ఒకటవ ప్రాధాన్యత ఓట్ లో ఎవరైనా అభ్యర్థికి 50 శాతానికి మించి మెజారిటీ రాకపోతే, రెండవ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది.
అలాగే, బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే, రెండు రోజులు కూడా పట్టే అవకాశం ఉండటంతో.. 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే, ఏసీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. నిరంతరం వెబ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది.
ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ.. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 17 రౌండ్లులలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు.. చెల్లుబాటు కానీ ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్దమైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం రెడీ అయింది. నల్లగొండలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా కౌంటింగ్ కోసం 25 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 వందల మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. మూడంచెల భద్రత మధ్య ఈ ప్రక్రియ సాగనుంది.
తొలుత 8 రౌండ్లలో 200 పోలింగ్ బూతుల ఓట్లను 25 ఓట్ల బండిల్స్ కడతారు. ఆ తర్వాత టేబుల్ కు వెయ్యి ఓట్లును ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అదే సమయంలో పోలైనటువంటి ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి సగానికి కంటే ఒక ఓటుతో గెలుపు కోటాను నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపుకోట చేరుకోకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత కూడా గెలుపు కోటా రాకపోతే చివరి అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ ఓట్లను లెక్కిస్తారు. గెలుపు కోటా చేరుకున్న అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
కరీంనగర్, నల్లగొండలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వస్తాయని అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది.
కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి కరీంనగర్‌లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు.
ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, సూపర్‌వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరికీ అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. నిన్ననే ఎన్నికల అధికారులు మాక్ కౌంటింగ్ కూడా చేపట్టారు.