జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించిన విషయం విదితమే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాలనా బాధ్యతలు రాష్ట్ర పతి చేతుల్లోకి వచ్చాయి. నేడు అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఇక ఇరు వర్గాలకు మధ్య చర్చలు జరిగే సమయంలో అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని.. అలాంటి వారికి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. గతంలో పరిస్థితులు చక్కబెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సార్లు సమీక్ష నిర్వహించారు. అయితే రాష్ట్ర పతి పాలన తర్వాత జరిగిన మొదటి సమీక్ష ఇది. ఈ సమావేశం నేడు ఢిల్లీ కేంద్రంగా జరిగింది. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ఉన్నతాధికారులు, ఆర్మీ, పారామిలటరీ అధికారులు ఈ సమావేశానికి హాజరై చర్చలు జరిపారు.
కాగా..ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో దాదాపు రెండేళ్లుగా జాతి హింస చెలరేగుతోంది. కానీ, పరిస్థితిలో ఏ మార్పూ లేదు. రాష్ట్రం అగ్నిగుండలా రగిలిపోతోంది. మెయ్‌తెయి, కుకి తెగల మధ్య రాజుకున్న హింసలో ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు వదిలారు. వేల సంఖ్యలో గాయాలపాలైనట్లు సమాచారం. కానీ, హింస ఆగడం లేదు. మణిపుర్‌లోని మెయితెయి తెగ ప్రజలు తమను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. 2023 మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రంలో భీకర హింస చెలరేగింది. మెయితెయిలు కుకిలను, కుకిలు మెయితెయిల స్థలాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటికీ హింస అలాగే కొనసాగుతోంది. ఎన్ని సార్లు చర్చలు జరపాలని చూసినా ఫలితం లభించలేదు.