ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయి రాజంపేట జైల్లో ఉన్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి అస్వస్ధతకు గురికావడం అబద్దమని తేలిపోయింది. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుండెనొప్పి వచ్చినట్లు జరిగిన ప్రచారం అంతా ఫేక్ అని పోలీసులు తేల్చేసారు. ఈ మేరకు రాజంపేట పోలీసులు ఓ ప్రకటన చేశారు.
ఇవాళ రాజంపేట జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే జైలు అధికారులు పోలీసుల సాయంతో ఆయన్ను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఏమీ తేలకపోవడంతో ఆయన్ను అక్కడి నుంచి రిమ్స్ కు కూడా పంపారు. అయితే అక్కడ కూడా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. పోసానికి ఏమీ కాలేదని నిర్దారించారు. ఈ మేరకు పోసాని అనారోగ్యంతో బాధపడటం ఒక నాటకమని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
ఇవాళ జైలు నుంచి రైల్వే కోడూరు ఆస్పత్రికి తరలించిన తర్వాత పోసాని కృష్ణమురళి అడిగిన అన్ని టెస్టులు చేయించామని . సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజంపేట ఆసుపత్రిలో, రిమ్స్ లో పోసానికి చికిత్స చేయించినట్లు ఆయన వెల్లడించారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను జైలుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు, పవన్ పై గత ప్రభుత్వంలో చేసిన వ్యాఖ్యల కేసులో పోసానిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయన్ను పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తీసుకొచ్చారు. స్టేషన్ లో విచారణ తర్వాత కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. రిమాండ్ పై జైలుకు పంపారు. ఆ తర్వాత ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ గుండెనొొప్పి ఎపిసోడ్ చోటు చేసుకుంది.