బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని , రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలుపై స్పష్టత ఇచ్చారు. సూపర్ సిక్స్ తో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు.
“పేదల జీవితాల్లో వెలుగు రావాలి. వారు ఆనందంగా ఉంటే చూడాలన్నదే నా కోరిక. గత ప్రభుత్వ పాలన చూశాం . రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అడవి పందుల్లా తిన్నంత తిని నాశనం చేసి పోయారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాం, అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన రూ. 24 వేల కోట్ల బకాయిలు తీర్చాం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా రూ. 3 లక్షల కోట్లతో బడ్జెట్ తెచ్చాం.
ఈ ఏడాది జూన్ నాటికి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తి చేసి పోస్టింగులు ఇస్తాం. మే నెలలో తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికి రూ.15 వేలు జమ చేస్తాం. అన్నదాత సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతుకూ ఏటా రూ. 20 వేలు ఇస్తాం. మత్సకారులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. రూ. 5 కే అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం” అని వెల్లడించారు.
పీ4తో పేదరిక నిర్మూలన
పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈనెల 30వ తేదీ ఉగాది నుంచి పీ4కు శ్రీకారం చుట్టబోతోన్నాం. పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకుని P4 విధానాన్ని అమలు చేస్తాం. ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది… అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతను ఇవ్వడం ద్వారా పేదలకు ఆర్థికంగా బలోపేతం చేయవచ్చు.
వైసీపీ తప్పుడు విధానాలతో రాష్ట్రాన్ని దోచుకుతింటే ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క రూపాయి పేదలకు ఖర్చు చేస్తోంది. నేను చెత్త నుంచి సంపద తయారుచేస్తే గత పాలకులు చెత్త మీద పన్ను వేశారే కానీ ఇంటి ముందు చెత్త తీయలేదు. గత ఐదేళ్లలో ఒక్క గ్రామంలోనూ సిమెంటు రోడ్డు వేయలేదు. గోకులాలూ నేను కట్టించినవే. 9 నెలల్లో 20 వేల కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులు చేసి గుంతలు పూడ్చాం.
వాళ్లతో జాగ్రత్త
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు, మంచినీటి కుళాయి, మరుగుదొడ్లు, కరెంటు , దీపం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. కేంద్ర నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించిన వారి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను నేను కోరేది ఒక్కటే. ఏ పార్టీ వల్ల లాభమో ప్రజలు ఆలోచించాలి. కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించే వారితో రాష్ట్రానికి చేటు తప్పించి ఉపయోగం లేదు