UPDATES  

NEWS

 కేవలం చట్టాలతో మహిళలకు రక్షణ కల్పించలేం.. అత్యాచార ఘటనలపై మాజీ సిజెఐ..

మహిళలకు భద్రత కేవలం చట్టాలతో కల్పించలేమని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. పుణే నగరంలో పట్టపగలు పోలీస్ స్టేషన్ పక్కనే ఒక బస్టాండు యువతిపై అత్యాచారం జరిగిన ఘటనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో మంగళవారం ఉదయం స్వార్‌గేట్‌ జంక్షన్‌ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్‌ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్‌గేట్‌ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడు 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్‌ గాడేగా గుర్తించారు.

 

చంద్రచూడ్ స్పందన

ఈ అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. ‘గతంలో ‘నిర్భయ’ ఉదంతం జరిగిన తర్వాత చట్టంలో అనేక మార్పులు వచ్చాయి. కేవలం చట్టాల వల్లే మహిళలకు రక్షణ కల్పించలేం. దీన్ని సమాజం ఒక పెద్ద బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు చట్టాలు అమలు తీరు కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. మహిళల రక్షణ కోసం చట్టాలను సరైన విధానంలో అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తాము బయటకు వెళితే సురక్షితమైన వాతావరణం ఉంది అనే భావన మహిళలకు రావాలి. ఈ తరహా కేసుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం. విచారణ న్యాయబద్ధంగా జరగాలి.. అలాగే కఠినమైన శిక్షలను అమలు చేయాలి. విచారణ తొందరగా పూర్తి చేసి శిక్షలను అంతే త్వరగా అమలు చేయాలి. ఇదంతా చేయడానికి న్యాయ వ్యవస్థతో పాటు పోలీసులది కూడా పెద్ద బాధ్యతే’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు.

 

నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు:

ఈ అత్యాచార ఘటనలో నిందితుడిగా చెప్పబడుతున్న 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్‌ ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన అనంతరం తిరిగి తన ప్రాంతానికి వెళ్లే క్రమంలో అతను చెరుకు తోటల్లో ఉన్నాడనే అనుమానంతో అక్కడ పోలీసులు సోదాలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా అత్యాచార ఘటన తర్వాత ఆ నిందితుడు తన డ్రెస్‌ మార్చుకోవడంతో పాటు షూస్‌ కూడా మార్చినట్లు తెలుస్తోంది. తొలుత కూరగాయాలు తీసుకెళ్లే వ్యాన్‌లో అతను తిరిగి పయనమైనట్లు గుర్తించిన పోలీసులు.. అటు తర్వాత అతని ఇంటికి సమీపంగా ఉన్న చెరుకు తోటల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దాంతో ప్రత్యేకమైన డాగ్‌ స్క్వాడ్స్‌తో పాటు డ్రోన్లను కూడా ఉపయోగించి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.

 

నిందితులను ఉరితీయాలి.. పూణే దారుణంపై అజిత్‌ పవార్‌, ఏక్‌నాథ్‌ షిండే

బస్సులో యువతిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడికి ఉరితీయాలని.. ఈ తరహా దారుణాలకు పాల్పడే వారందరికీ మరణశిక్ష విధించాలని డిప్యూటీ సీఎం, అధికార శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్‌ షిండే, రెండో డిప్యూటీ సీఎం ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పుణే ఘటన చాలా దురదృష్టకరం. నిందితులు ఎవరైనా ఉపేక్షించబోం. అలాంటి వారిని ఉరితీయాలి’ అని ఏక్ నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు

బస్సులో జరిగిన అత్యాచార ఘటనపై మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేశాయి. ఈ తరుణంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి చెందిన పార్టీ నేతలు గురువారం స్వర్‌గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన బాట పట్టారు. మహిళల భద్రత కంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఉచితాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

 

అజిత్‌ పవార్‌ స్పందన:

అజిత్‌ పవార్‌ సైతం దారుణంపై మీడియాతో మాట్లాడారు. “స్వర్గేట్ బస్ స్టేషన్‌లో జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం, అవమానకరమైనది. నిందితుడు చేసిన నేరం క్షమించరానిది. ఇలాంటి నేరస్తులకు మరణశిక్ష తప్ప మరొకటి ఉండదు. దారుణంపై సమాచారం అందుకున్న వెంటనే నిందితుల్ని అరెస్ట్‌ చేయాలని పూణే పోలీసు కమిషనర్‌ను ఆదేశించడం జరిగింది.” అని చెప్పారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |