తెలంగాణ అంతటా త్వరలో అన్ని రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. దీనికి సంబంధించి రంగం సిద్ధమైంది. పీఎంఈ డ్రైవ్ స్కీమ్ కింద తెలంగాణకు 2,800 ఈవీ బస్సులను ఇవ్వాలని ఆరు నెలల కిందట కేంద్రాన్ని అభ్యర్థించింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రతిపాదనకు ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ అంతటా ఈవీ వాహనాలు
కోరినన్ని బస్సులను ఇస్తామని తెలిపింది. అందుకు 30 శాతం సబ్సిడీపై అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అన్ని బస్సులకు సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని కూడా విడుదల చేసింది. ఇదిలాఉండగా కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం.. ఈవీ బస్సులను ఆర్టీసీకి అద్దెకిచ్చే సంస్థ నుంచే డ్రైవర్లు ఉంటారు. అయితే ఆ తరహా బస్సుల వినియోగంతో ఆర్టీసీ డ్రైవర్లకు ఉపాధి పోతుందని కొందరు డ్రైవర్లు ఆరోపిస్తున్నాయి.
డ్రైవర్ల వ్యవహారం
ఈ నేపథ్యంలో ఈవీ బస్సులలో ప్రైవేట్ సంస్థకు చెందినవారు కాకుండా ఆర్టీసీ సిబ్బందిని డ్రైవర్లుగా కొనసాగించాలని ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిపై కేంద్రం నుంచి స్పష్టత రావాల్సివుంది.
ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా ఈవీ వాహనాలను అమలు చేస్తామని పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇదిలావుండగా హైదరాబాద్‌లో ప్రస్తుతం 3 వేల డీజిల్ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఈవీ వాహనాలు వచ్చిన తర్వాత వాటిని నగరం నుంచి ఓఆర్‌ఆర్ బయటకు తరలిస్తామని గతంలో వెల్లడించారు. ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాయితీలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కూడా.
అదనపు ఛార్జీల మాటేంటి?
తెలంగాణ ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు కొత్త సమస్య మొదలైంది. ఇంధన భారాన్ని తగ్గించుకోవడం, పర్యావరణాన్ని రక్షణ ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ బస్సుల్లో గ్రీన్ ట్యాక్స్ పేరుతో టికెట్‌పై అదనపు ఛార్జీ వసూలు చేయడంపై ప్రయాణికులు కాసింత ఆగహ్రం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10, మిగతా వాటిల్లో రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సమాచారాన్ని టికెట్‌పై ముద్రించడం లేదన్నది ప్రయాణికుల మాట. తరచూ ప్రయాణించే వారికి అదనపు ఛార్జీ గురించి తెలుస్తోంది. ముందుగా చెప్పకుండా ఎందుకు వసూలు చేస్తున్నారని కండక్టర్‌లతో ప్రయాణికులు గొడవకు దిగుతున్న సందర్భాలు క్రమంగా పెరుగుతున్నాయి.
గతంలో టికెట్‌పై బస్ ఛార్జీలు, టోల్‌గేట్, సెస్ ఛార్జీల వివరాలను ముద్రించేవారు. వరంగల్ రీజియన్‌లో 74 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ రూట్లలో డీజిల్ బస్సులను తగ్గించింది. వాటిలో 19 డీలక్స్ బస్సులు, 34 ఎక్స్‌ప్రెస్, 21 సూపర్ లగ్జరీ ఉన్నాయి.
వరంగల్ నుంచి హైదరాబాద్‌కు డీలక్స్ బస్సుకు రూ.260 ఛార్జీ ఉంది. దాన్ని రూ.280 పెరిగినట్టు చెబుతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.200 అయితే రూ.210 తీసుకుంటున్నారు. సూపర్ లగ్జరీ రూ.300 అయితే రూ.320 వసూలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో టికెట్‌పై గ్రీన్ ట్యాక్స్ అదనంగా పడుతుందని కొందరు అధికారుల మాట. అయితే అదనపు ఛార్జీని టికెట్‌పై ఈ విషయాన్ని ముద్రించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతామని అంటున్నారు.