ఇక అందరికీ పెన్షన్. కేంద్రం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 60 ఏళ్లు దాటిన అందరికీ పెన్షన్ అందేలా కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. అసంఘటిత కార్మికులతో పాటుగా గిగ్ వర్కర్లకు అమలయ్యేలా కసరత్తు కొనసాగుతోంది. ఈపీఎఫ్‌వో ఆధ్వర్యంలో నిబంధనల రూపకల్పన జరుగు తోంది. త్వరలో అభిప్రాయ సేకరణ పూర్తి చేసి అమలు దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా 60 ఏళ్లు దాటిన అందరికీ భరోసా కల్పించే విధంగా ఆమోద ముద్ర వేయనుంది.
కొత్త పెన్షన్ పథకం
కేంద్రం కొత్త కార్యక్రమం ప్రారంభించేందుకు సిద్దమైంది. అందరికీ కొత్తగా పెన్షన్ పథకం అమలు చేయాలని భావిస్తోంది. ఇందు కోసం కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం అందుబాటులోకి రానుంది. అసంఘటిత రంగంతో పాటుగా అందరికీ ఈ పెన్షన్ లబ్ది కలిగే లా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇప్పటి వరకు సంఘటిత రంగానికి చెందిన నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు పొదుపు పథకాలు అమల్లో లేవు. కాగా, ప్రస్తుతం అమలు అవుతు న్న ఈపీఎఫ్ఓ పథకాల్లో ఉద్యోగులు, వారు పనిచేసే సంస్థ నుంచే కంట్రిబ్యూషన్ అందుతోంది. వీటిల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి వాటా ఉండటం లేదు.
వీరికీ వర్తింపు
కాగా, అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారులు, గృహనిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్‌ధన్ యోజన తో పాటుగా 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3 వేలు అందించే ప్రధాన మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన వంటి పథకాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. వీటికి కొంత మొత్తం ప్రజలు చెల్లిస్తుండగా, మరికొంత ప్రభుత్వం భరిస్తోంది. దీంతో, 60 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలనే ప్రతిపాదన పైన కసరత్తు జరుగుతోంది. ఇతర దేశాల్లో ఇప్పటికే సార్వత్రిక పెన్షన్ పథకం అమలు చేస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల ను హేతుబద్ధీకరణ చేయాలని భావిస్తున్నారు.
ప్రతిపాదనలపై కసరత్తు
ప్రభుత్వ తాజా ఆలోచనల మేరకు ఉద్యోగం చేస్తున్న వారితో పాటుగా స్వయం ఉపాధి పొందుతు న్న వారికి కూడా కొత్త విధానం వర్తించేందుకు వీలుగా ఈపీఎఫ్‌వో ఆధ్వర్యంలో విధివిధానాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పెన్షన్ పొందాలని భావించే వారు నెల వారీగా ఎంత మేర చెల్లించాలనే అంశం పైన కసరత్తు జరుగుతోంది. వీరికి 60 ఏళ్ల తరువాత రూ 3 వేల వరకు పెన్షన్ రూపంలో అందించేలా ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రతిపాదనల పైన అభిప్రాయ సేకరణ పూర్తి చేసి అమలు దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.