ఏపీ, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఏడు గంటలకు పోలింగ్ కేంద్రాలకు వద్దకు ఓటర్లు వచ్చారు.
ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో 22,493 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఉపాధ్యాయులు. 13508 మంది పురుషులు, 8985 మంది స్త్రీలు ఉన్నారు. ఉత్తరాంధ్ర పరిధిలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రిటర్నింగ్ అధికారి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు.
ఉభయగోదావరి
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వారిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కృష్ణా-గుంటూరు
కృష్ణా-గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. మొత్తం 25 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. అయితే టీడీపీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, స్వతంత్ర అభ్యర్థిగా లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థికి వైసీపీ మద్దతు ఉంది. మొత్తం 3, 47, 116 మంది ఓటర్లు ఉన్నారు. అందులో కృష్ణా జిల్లా నుంచి 1, 41, 182 మంది ఓటర్లు ఉన్నారు. మిగతా రెండు లక్షల మంది గుంటూరు జిల్లాకు చెందిన ఓటర్లు ఉన్నారు.
తెలంగాణలో మూడు సీట్లకు పోలింగ్
తెలంగాణలో మూడు శాసనమండలి సీట్లకు గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్, సాయంత్రం నాలుగు వరకు జరగనుంది. ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల పట్టబధ్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
వరంగల్ -ఖమం-నల్గొండ
వరంగల్ -ఖమం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్సీ టీచర్స్ బరిలో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం ఓటర్లు 25,797 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకోసం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్
ఉమ్మడి ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 54406 మంది కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 134 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్స్ బరిలో 56 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఎమ్మెల్సీ టీచర్స్ బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు 77 ఉండగా, టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు 58 ఉన్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లోఉంది.