ఏపీ బడ్జెట్‌కు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. ఈనెల 28న ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి తొలి రోజు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉంటుంది. 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరపనున్నారు.
మూడు వారాల పాటు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై క్లారిటీ రానుంది. ఆ మీటింగ్‌లో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే సభకు పూర్తిస్థాయి సబ్జెక్టుతో సిద్ధమై రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిధుల కేటాయింపునకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలను తెచ్చుకుని ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది.
వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందని, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి లేదని చెబుతూ, ఇప్పటిదాకా ఓటాన్ అకౌంట్‌తోనే పెట్టుకొస్తుంది. ఇప్పడు అధికారంలో వచ్చిన 10 నెలల తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రేవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది. బడ్జెట్ సమావేశాలతో ప్రభుత్వం నుంచి కీలక ప్రకటనలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్‌లోని పథకాల అమలు, విశాఖ స్టిల్ ప్లాంట్, పోలవరం, అమరావతి నిర్మాణానికి సంబంధించి శుభవార్తలు వినొచ్చనే అంచనాలున్నాయి.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. మత్స్యకారుల భరోసా, అన్నదాత సుఖీభవ స్కీంల అమలుపైన కసరత్తులు జరుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని వరాలు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా.. రారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన రాకుండా మిగతా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా? అనేది కూడా క్లారిటీ లేదు. లేదంటే.. వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోయిన.. అసెంబ్లీ రిజస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లిపోవచ్చని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేసినా అసెంబ్లీకి హాజరు అయినట్టేనని చెబుతున్నారు. ఇక వైసీపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ స్టాండ్ ఏంటీ.. మాజీ సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..