ఆ టీడీపీ లీడర్ పట్టువదల్లేదు. తనకు అన్యాయం జరిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. ఏకంగా మాజీ మంత్రిపై కేసు నమోదయ్యేలా చేసి, తన పంతం నెగ్గించుకున్నాడు. తనను చిత్రహింసలు పెట్టిన ఆ మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యేలా చేశారు. అసలేం జరిగిందంటే..
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజినీ గత ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడ పని చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి వ్యవహరించేవారు. అయితే పిల్లి కోటి పోస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు చేశారన్నది కోటి ఆరోపణ. అంతేకాదు తనను 5 రోజులు చిత్రహింసలకు గురి చేస్తుంటే విడదల రజినీ వీడియో కాలింగ్ ద్వార చూశారని కూడ కోటి పలుమార్లు ఆరోపించారు.
ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే కోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోటి, హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. కోటి పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం, పల్నాడు జిల్లా ఎస్పీకి కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిలకలూరిపేట పోలీసులు మాజీ మంత్రి విడదల రజినీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు.
అలాగే రజినీ పీఏలుగా పనిచేసిన ఎన్.జయ ఫణీంద్ర, రామకృష్ణ, అప్పటి చిలకలూరిపేట అర్బన్ సీఐ వి.సూర్యనారాయణలపై కూడ కేసు నమోదు కావడం విశేషం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విడదల రజినీ తమను బెదిరించారని పలువురు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా రజినీపై కేసు నమోదు కావడంతో, పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఏదిఏమైనా టీడీపీ నాయకుడు కోటి మాత్రం.. ఎట్టకేలకు రజినీపై కేసు నమోదయ్యేలా చేశారని టీడీపీ నాయకులు అంటుండగా, తనపై కేసు నమోదు కావడంపై రజినీ స్పందించాల్సి ఉంది.