ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తి దృష్టి సారించింది. అయితే అనర్హులను ఏరివేయడంలో కూడ ప్రభుత్వం అంతే స్థాయిలో స్పీడ్ అయింది. అర్హత ఉంటే పథకాలతో లబ్ధి చేకూర్చాలని, అనర్హత ఉండి కూడ పథకాలు పొందితే సహించేది లేదన్నట్లుగా ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఇంటి పట్టాలు మంజూరు చేశారన్న కోణంలో.. ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇటీవల ఏపీలో అనర్హత పింఛన్ల తొలగింపుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అధిక సంఖ్యలో అనర్హులు ప్రభుత్వం ద్వార లబ్ధి పొందుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఇంటింటికి వెళ్లి అర్హత ఉందా లేదా అనే కోణంలో విచారించారు. వికలాంగ సర్టిఫికెట్ లను సృష్టించి అనర్హులు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతున్నారన్న కోణంలో సుమారు 8 వేలకు పైగా పింఛన్ దారులకు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
అర్హత ఉండి కూడ పథకంతో లబ్ధి పొందని వారిని గుర్తించే కార్యక్రమానికి కూడ ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోనుంది. తాజాగా మరో పథకం ద్వార లబ్ధి పొందిన అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి పట్టాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పట్టాల మంజూరులో అనర్హులకు చోటు దక్కిందని ఫిర్యాదులు అందాయి. దీనితో ప్రభుత్వం అనర్హులను గుర్తించి పట్టాలను రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా ఈ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
లబ్ధిదారులకు కారు ఉందా? కుటుంబంలో ఎక్కువమంది పట్టాలు పొందారా? అనే కోణంలో అధికారులు వివరాలను సేకరించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 22.80 లక్షల మందికి ఇంటి స్థలాలు మంజూరు చేయగా, సుమారు 7 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు సమాచారం. అధికారుల విచారణ ప్రక్రియ పూర్తయితే కానీ, పట్టాల పంపిణీలో అనర్హులకు చోటు దక్కిందా లేదా అన్నది తేలే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక్కొక్క పథకంలో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సిద్దమవుతుండగా, రాజకీయ పలుకుబడితో లబ్ది పొందిన వారు ఇప్పుడు ఆలోచనలో పడ్డారట. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అర్హులు హర్షం వ్యక్తం చేస్తుండగా, అనర్హులు మాత్రం ఇదెక్కడి గోల.. అంటూ నిట్టూరుస్తున్నారట.