భూ ఆక్రమణలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అమీన్ పూర్ మున్సిపాలిటీలో తమకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగించేందుకు కమిషనర్ రంగనాథ్ శుక్రవారం పర్యటించారు. మున్సిపాలిటీలోని పలు లే అవుట్లపై ఫిర్యాదులు రాగా.. స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు కమిషనర్ పర్యటించారు. అయితే కమిషనర్ పర్యటన సందర్భంగా బాధితులు అక్కడికి చేరుకొని, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ప్రధానంగా ఐలాపురం, చక్రపురి కాలనీల సందర్శనలో బాధితులు తమగోడు వెళ్లబోసుకున్నారు.
ఐలాపురంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధితుల ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజావాణితో పాటు స్థానికంగా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు స్థానికంగా ఉన్న స్థితిగతులను తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే 1980 లో తాము కొన్న ఇంటి స్థలాలను ముఖీం అనే వ్యక్తి కబ్జా చేశారంటూ ఐలాపురం గ్రామ లేఅవుట్ వాసులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్.. లేఅవుట్ పై కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తామని, అప్పుడే అసలైన లబ్ధిదారులు ఎవరన్నది తేలుస్తామంటూ ప్రకటించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయడమే హైడ్రా లక్ష్యమంటూ రంగనాథ్ హామీ ఇచ్చారు. చట్టం ముందు ఎవరైనా ఒకటేనని, న్యాయస్థానం ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామన్నారు.
కాగా లే ఔట్ వాసులు ఫిర్యాదు చేసిన ముఖీం అనే వ్యక్తి హైకోర్టు న్యాయవాదిగా ఉన్నట్లు ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. అయితే విచారణ జరుగుతున్న సమయంలో కమిషనర్ రంగనాథ్ వద్దకు వచ్చిన ముఖీం వీరంగం చేసినట్లు ఫిర్యాదు దారులు తెలిపారు. అలాగే బాధితుడు లక్ష్మీనారాయణకు ముఖీం ఫోన్ చేసి బెదిరించినట్లు ఓ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఆడియో కాల్ లో ముఖీం వాయిస్ ను ఎవరైనా మిమిక్రీ చేశారని కూడ మరో కోణంలో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఆడియో కాల్ ఆధారంగా.. మీ ఇల్లు ఎక్కడో తెలుసు అంటూనే, కమిషనర్ కు ఎవరు ఫిర్యాదు చేశారని గట్టిగా బెదిరించినట్లుగా ఉంది. సీఎంకు ఫిర్యాదు చేసినా ఏమి చేయలేరంటూ, తాను లోకల్ అని పేర్కొనడం విశేషం.
మొత్తం మీద ఈ ఆడియో కాల్ లో ఏ మేరకు వాస్తవం ఉందో కానీ, కమీషనర్ రంగనాథ్ పర్యటించిన అనంతరం ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే హైడ్రా అధికారులు.. ఈ ఆడియో వాస్తవమా లేక ఎవరైనా సృష్టించారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాబోతోందని, కబ్జాదారులపై తప్పక చర్యలు ఉంటాయని రంగనాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన భూములను కాపాడాలనే సదుద్దేశంతో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఫిర్యాదులను చిన్నంగా పరిశీలించిన అనంతరమే కబ్జాదారులపై చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు.