తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించిన ఈసీ, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ అందించడంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 15వ తేదీలోగా సంబంధిత సిబ్బందికి ఎన్నికల తీరుపై శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పవచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలలో తమ హవా కొనసాగించేందుకు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించాయి. మొదటగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీలు సమాయత్తమయ్యాయి.
ఈ దశలో ఓవైపు రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ఎన్నికల కమిషన్ కూడా అదే రీతిలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. ఈనెల 10, 12, 15న పీవో, ఏపీవో లకు శిక్షణ ఇవ్వనుండగా పదవ తేదీలోగా ఎన్నికలకు సిబ్బందిని నియమించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఖరారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 10వ తేదీ విడుదల కాబోతుందని, 24న మొదటి విడత ఎన్నికలు, మార్చి మూడో తేదీన రెండో విడత ఎన్నికలు, మార్చి పదవ తేదీన మూడో విడత ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పై అధికారిక ప్రకటన చేయలేదు.
ఇటీవల సీఎల్పీ సమావేశం నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్.. స్థానిక సంస్థల ఎన్నికలలో తమ హవా చాటుకునేందుకు నాయకులను సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించిందని, ఓవైపు రాష్ట్ర అభివృద్ధి తో పాటు, మన వైపు సంక్షేమ పథకాలను కూడా అమలు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు.