ఏపీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న రైల్వే జోన్ విషయంలో కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కొన్నాళ్లుగా అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శాస్త్రీయంగా, సాంకేతికంగా రైల్వే జోన్ ఏర్పాటు వీలుకాదని గతంలో చెప్పిన రైల్వే శాఖ.. కేంద్రం పెద్దల ఒత్తిడితో జోన్ ఏర్పాటు ప్రణాళికల్ని వేగవంతం చేసింది. కాగా.. ఈ నిర్ణయానికి కేంద్ర క్యాబినేట్ తాజాగా ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి.. విశాఖ పట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.
సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ కేంద్రం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగానే.. వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
జోన్ పరిధి ఎంత వరకు?
తాజా నిర్ణయం మేరకు విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో సౌత్ కోస్టు జోన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత జోన్ ఏర్పాటుతో.. విశాఖపట్నం డివిజన్ తీవ్రంగా మార్పులకు గురవుతుందని అంటున్నారు. అంటే.. వాల్తేరు, ఖుర్దా రోడ్, సంబల్‌పూర్ – మూడు డివిజన్‌లతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడింది. అలాగే.. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, హైదరాబాద్, నాందేడ్, సికింద్రాబాద్ – ఆరు డివిజన్‌లతో సౌత్ సెంట్రల్ రైల్వే పని చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు జోన్ల పరిధిలోని డివిజన్లల్లో మార్పులు చేసి, కొన్నింటిని ఈస్ట్ కోస్ట్ జోన్ కిందకు చేర్చాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలుపుతున్నారు.
వాల్తేరు డివిజన్ పేరు మార్పు
ఇప్పటి వరకు వాల్తేరు పేరుతో ఉన్న డివిజన్ ను ఇకపై విశాఖ డివిజన్ పేరుతో వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల బోర్డు రాసిన లేఖలో వెల్లడించింది. దీని ప్రకారం.. వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా చేశారు. వాటిలో ఒకటి విశాఖ కాగా, మరొకటి రాయగఢ్. 410 కి.మీ మేర విశాఖ డివిజన్ కిందకు రానుండగా.. ఇందులో పలాస – విశాఖపట్నం – దువ్వాడ, కూనేరు – విజయనగరం, నౌపడ జంక్షన్ – పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్. సాలూరు, సింహాచలం నార్త్ దువ్వాడ బైపాస్, వదలపూడి దువ్వాడ వరకు ఈ డివిజన్ ఉండనుంది. ఇక రాయగఢ్ డివిజన్ పరిధిలో 680 కి.మీ నిర్దేశించిన అధికారులు… వివిధ రూట్లను ఇందులో చేర్చారు.
పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ అంటే ఏంటి.?
వాస్తవానికి ఏదైన నూతన ప్రతిపాదన వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కార్యచరణ ప్రారంభించే ముందుగానే సంబంధిత విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాల స్థాయిల్ని బట్టి అనుమతులు ఇచ్చే స్థాయిలు పెరుగుతుంటాయి. కాగా.. రైల్వేలో జోన్లు ఏర్పాటు చేసే అత్యున్నత అధికారం కేంద్ర క్యాబినేట్ స్థాయిలో జరగాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పటికే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విషయంలో అనేక నిర్ణయాలు జరిగిపోయాయి. డివిజన్ల విభజన, కొత్త డివిజన్ల ఏర్పాటు సహా అనేక నిర్ణయాలు జరిగిపోయాయి.. అందుకే పోస్ట్ ఫ్యాక్టో అఫ్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర క్యాబినేట్ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల్ని అనుమతిస్తూ.. నిర్ణయం తీసుకుంది.